భారత్ బంద్ ఎందుకు ?

ఈరోజు భారత్ బంద్ మొదలయ్యింది. ఇది రాసేటప్పటికి అది విజయవంతమయ్యిందా అనేది తేలకపోయినా అసలు ఈ బంద్ కి పిలుపునివ్వటమే ఓ విశేషం. ఒకవైపు చర్చలు జరుగుతూనే వున్నాయి మధ్యలో బంద్ చోటుచేసుకుంది. ఇప్పటికీ రైతుల ఆందోళన ఎందుకో అర్ధంకావటం లేదు. పార్లమెంటు ఆమోదించి చట్టరూపం దాల్చిన మూడు వ్యవసాయ చట్టాలు వుపసంహరించుకోవాలనేది వారి డిమాండ్. వాటివలన వారికి ఏ విధంగా నష్టమో చెప్పరు. ఈ చట్టాల వలన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దత్తు ధర పోతుందట. […]

Written By: Ram, Updated On : December 8, 2020 10:17 am
Follow us on

ఈరోజు భారత్ బంద్ మొదలయ్యింది. ఇది రాసేటప్పటికి అది విజయవంతమయ్యిందా అనేది తేలకపోయినా అసలు ఈ బంద్ కి పిలుపునివ్వటమే ఓ విశేషం. ఒకవైపు చర్చలు జరుగుతూనే వున్నాయి మధ్యలో బంద్ చోటుచేసుకుంది. ఇప్పటికీ రైతుల ఆందోళన ఎందుకో అర్ధంకావటం లేదు. పార్లమెంటు ఆమోదించి చట్టరూపం దాల్చిన మూడు వ్యవసాయ చట్టాలు వుపసంహరించుకోవాలనేది వారి డిమాండ్. వాటివలన వారికి ఏ విధంగా నష్టమో చెప్పరు. ఈ చట్టాల వలన ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దత్తు ధర పోతుందట. ప్రభుత్వం ఇకనుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా ధాన్యం కొనదట. ఈ సారాంశాన్ని ఎక్కడనుంచి తీసుకున్నారు. తెలియదు. ఎవరినడిగినా ఇదేమాట. ఈ మూడు చట్టాలు తొలగిస్తేగాని శాంతించమని భీష్మించుకు కూర్చున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల హైవే ని ఆక్రమించేసారు. కాదు మీ కోసం ఓ ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశామంటే అదేం కుదరదు, మేము ఇక్కడే వుంటామంటారు. అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు.

మేము సైతం మీకోసం అండగా ఉన్నామని సాంఘిక మాధ్యమాల్లో పోస్టింగులు. ఆ పోస్ట్ చేసే వాళ్ళలో సగం మందికి ఈ చట్టాల లోతుపాతులు తెలుసని అనిపించటంలేదు. భావోద్రేకాలతో మాట్లాడటమే ఎక్కువగా కనిపిస్తుంది. రైతులనంగానే ఆమాత్రం అభిమానం, సానుభూతి వుండటం ఆహ్వానించ దగ్గదే. ఎక్కడెక్కడో వున్న వారు ప్రతిస్పందిస్తున్నారు. లండన్, టొరంటో, వాషింగ్టన్ ఒకటేమిటి అనేక సిటీల్లో ప్రదర్శనలు చేస్తున్నారు. విశేషమేమంటే భారత్ లోని సహ రైతుల కన్నా వీరి మద్దత్తు ఎక్కువగా వుందనిపిస్తుంది. మరి వీళ్ళందరికీ ఈ చట్టాల్లో ఏముందా తెలుసా? అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓ సానుభూతిని ప్రదర్శిస్తే సరి. మావంతు కర్తవ్యమ్ నేరవేర్చామని అనుకుంటున్నట్లుగా వుంది. ఇందులో పనిలో పనిగా ఖలిస్తాన్ జండాలు, ప్లకార్డులు  పట్టుకుంటున్నారు. ఇండియాలో అయితే ఎప్పటిలాగే ప్రొఫెషనల్ మద్దత్తుదారులు రెడీ అయిపోయారు. అది ఏ సంఘటన అయినాగాని మోడీని ఇరకాటంలో పెట్టేదయితే చాలు. అక్కడ వాలిపోతారు. అది షహీన్ బాగ్ కానివ్వండి, కాశ్మీర్ మానవహక్కులు కానివ్వండి, ఇంకేదయినా కానివ్వండి క్రైటీరియా ఒక్కటే అది మోడీకి వ్యతిరేకమా కాదా. అంతే. లేకపోతే రైతుల కనీస మద్దత్తు ధర కోసం ( అదెక్కడకీ పోలేదు సుమా) విదేశీ ప్రదర్శనలు ఏమిటి, విద్యార్ధి సంఘాలు ఏమిటి ? మద్దత్తు తెలిపే హక్కు ఎవరికైనా వుంది, అందులో సందేహం లేదు. కాకపోతే ఎందుకు? ఏమి అన్యాయం జరిగిందని? ఎప్పటికన్నా ఎక్కువ గోధుమలు ఈసారి కొన్నందుకా? ఎప్పటికన్నా ఎక్కువ ధరకి కొన్నందుకా? దేశం మొత్తం మీద పంజాబ్ లో ఎక్కువ శాతం ప్రభుత్వపరంగా కొన్నందుకా? ఎందుకు? ఇది చాలా వింతగా వుంది. ప్రభుత్వం మేము కనీస మద్దత్తు ధర తీయము అని పదే పదే చెపుతున్నందుకా? అదేమంటే రైతులం కాబట్టి ఏమి మాట్లాడినా ఎవరూ ఏమి అనకూడదు. మోడీని నీకు ఇందిరా గాంధీ గతే పడుతుందని హెచ్చరించినా, బింద్రెన్ వాలా ని అమరవీరుడని కీర్తించినా వాళ్ళ మీద చర్య తీసుకోకూడదు. ఇదేమి ఉద్యమం? అన్యాయం జరక్కపోయినా మాకు అన్యాయం జరిగిందని ఉద్యమం చేయటం, దానికి దేశ, విదేశాలనుంచి మద్దత్తు తెలపటం అంతా చూడటానికి వింతగా వుంది.

రాజకీయపార్టీల ఆనందకేలి 

ఇంకేముంది రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవకాశం రానే వచ్చింది. అంతకుముందు ఇదే సంస్కరణలు కావాలని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా వండి వార్చేస్తున్నారు. ఆరోజు మేము మాట్లాడిన సందర్భం వేరని, లేకపోతే బిల్లులు పెట్టినతీరు బాగాలేదని, ఇంకా అన్నిరకాల సన్నాయి నొక్కుల్ని అరువుతెచ్చుకుంటున్నారు. మరి మీరు అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఎందుకు వ్యవసాయ మార్కెట్ చట్టాలను మార్చారు అంటే నోరు మెదపరు. 17రాష్ట్రాలు ధాన్యాన్ని తప్పించి మిగతా పంటలను మార్కెట్ చట్టాలనుంచి ఎందుకు మినహాయించారో చెప్పరు. 19 రాష్ట్రాలు కాంట్రాక్టు వ్యవసాయాన్ని, ప్రత్యక్షంగా రైతుల దగ్గర నుంచి కొనటానికి చట్టంలో మార్పులు చేస్తే అది తప్పులేదు. అది వాళ్ళ రాష్ట్రాల్లో రైతుల మేలు కోసం. అదే కేంద్రం చేస్తే తప్పు. ఇదేమి వింత వాదన. మన తెలుగు రాష్ట్రాలు కూడా అందులో వున్నాయి కదా. మరి అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు? రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటే అది ఏదో ఒకరోజు మీకే ఎదురుతిరుగుతుంది. ఇంతకీ ఈ చట్టాల్లో కనీస మద్దత్తు ధర విషయం ఎక్కడ వుందో కనీసం ఈ రాజకీయ నాయకులయినా చెప్పాలి. అసలు మీరు మీ రాష్ట్రాల్లో మార్కెట్లను ఎంతమేర అభివృద్ధి చేసారు? ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు? ఆ పనులు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కదా. ఏదైనా వివాదమొస్తే వ్యవసాయం మా పరిధి లోనిదంటారు కాని బడ్జెట్ లో నిధులు కేటాయించటం వచ్చేసరికి శీతకన్ను వేస్తారు. ఇది ఎప్పట్నుంచో జరుగుతుంది.

పంజాబ్ లో ఏమి జరుగుతుంది?

ఒక్కసారి పరిశీలిస్తే పంజాబ్ జిడిపి క్రమంగా తగ్గుతూనే వస్తుంది. దేశ జిడిపి అంగలు వేస్తూ ముందుకెలుతుంటే పంజాబ్ మాత్రం వెనకకు నడుస్తూ వుంది. ఇది గత దశాబ్దం నుంచి జరుగుతుంది. ఒకనాడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన చోట స్తబ్దత వచ్చింది. ఇది గమనించకుండా ఇప్పటిదాకా బాగుండి ఇప్పుడేమో కిందకు పడిపోతామేమోనని భయపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతుంది. అన్ని రాష్ట్రాలకన్నా వ్యవసాయ రంగం పంజాబ్ లో ఎందుకు నత్త నడక నడుస్తుంది? ఎందుకు జిడిపి వృద్ధిరేటు తక్కువగా వుంది. ఆ గణాంకాలన్నీ మీముందు పెట్టి సమయం వృధా చేసుకోదలుచుకోలేదు. ఎవరైనా ఇంటర్నెట్ లో చూసుకోవచ్చు. ఈ రైతు చట్టాల వలన వ్యవసాయ రంగం కుదేలు కాదు, ఇప్పటికే కుదేలైపోయింది తెలుసుకోండి. దీనికి మందు వేయకపోతే జబ్బు పెరుగుతుంది తెలుసుకోండి. తెలుగు మీడియాలో సరైన , లోతయిన పరిశీలన చేయకుండా చర్చలమీద చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు పంజాబ్ వ్యవసాయంలో వెనకబడింది? ఇంకా ఈ చట్టాలు అమలుకాలేదే? రాజకీయనాయకుల ప్రాబల్యంతో ఆర్తియాలు రైతులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తుంటే ఈ వ్యవసాయరంగం బాగుపడదు. మత్తుమందుతో పాటు, ఈ కాలం చెల్లిన వ్యవస్థతో పంజాబ్ కాలం వెల్లబుస్తుంది. ఒకనాడు పంజాబ్ కాదు, ఇప్పుడు మిగతా రాష్ట్రాలు దానికన్నా ముందుకు పరిగెత్తుతుంటే పంజాబ్ వెనకబడి పోయింది. ముందు దీన్ని గురించి ఆలోచించండి. గోధుమ, వరి పంటల నుంచి బయటకు రావాలి. పంజాబ్ రైతులు స్వతహాగా శ్రామికులు. వాళ్ళను సరిగ్గా గైడ్ చేస్తే అద్భుతాలు సృష్టించగలరు. ఇంకో గ్రీన్ రెవల్యూషన్ కి స్వీకారం చుట్టే సత్తా వారికి వుంది. త్వరలోనే తమ తప్పుని తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు ఒక్కటే పరిష్కారమని గ్రహిస్తారు. అప్పటివరకూ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ మంచి ఘడియల కోసం ఎదురుచూడటం తప్పించి.