Jagan Govt- Contractors: ఏపీలో చేస్తున్న పనులకు డబ్బులు ఇవ్వడం లేదు. లక్ష నుంచి కోట్ల రూపాయలతో చేపడుతున్న పనుల బిల్లులు పెండింగ్ లో పెడుతున్నారు. చివరకు కొవిడ్ సమయంలో బాధితులకు పెట్టిన భోజనా ల సొమ్మును సైతం చెల్లించలేదు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, సరఫరాదారులు బాధితులుగా మారారు. బిల్లుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టులు ఆదేశాలిచ్చినా అమలుకాక.. ధిక్కారణ పిటీషన్లు దాఖలవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ బాధితుల జాబితాలో వైసీపీ నేతలు చేరుతుండడం విశేషం. కర్నూలు జిల్లా అదోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత వీరారెడ్డి బైఠాయించి నిరసన తెలపడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 30 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, సరఫరాదారుల బిల్లులకు మోక్షం కలగడం లేదు. గత ప్రభుత్వాల నుంచి పనులు చేయడం, చిన్న చిన్న వస్తువులనుసరఫరా చేయడం ద్వారా వీరంతా ఉపాధి పొందుతున్నారు. వారంతా ఎగువ మధ్యతరగతికి చెందిన వారే. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వారిని ధనిక వర్గాలుగా చూసినట్టుంది, అందుకే బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తూ వస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బిల్లులు చెల్లించకపోవడంతో రద్దు పద్దుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఇలా బిల్లులు చెల్లించలేక చాలా మంది అప్పులపాలవుతున్నారు. మరికొందరు బంధువుల ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధలు భరించలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కార్యాలయాలకు తిరిగి తిరిగి వేశారిపోయే కాంట్రాక్టర్లు, సరఫరాదారులు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కొంతమందికి బిల్లులు చెల్లిస్తున్నా.. మరికొందరి విషయంలో రకరకాల కారణాలతో రిక్తహస్తం చూపిస్తున్నారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు ధిక్కారణ పిటీషన్లు వేస్తున్నారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ల వరకూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ప్రభుత్వం వారి చర్యలనుతప్పు పడుతూ సేవాపరమైన శిక్షను విధిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోయింది.

అప్పుడెప్పుడో కొవిడ్ సమయంలో బాధితుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆ సమయంలో వసతి, భోజనం కల్పించారు. ఎక్కడికక్కడే స్థానికంగా సరఫరాదారుల నుంచి ఏర్పాటుచేశారు. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. కానీ సంవత్సరాలు దాటినా చెల్లించలేదు. దీంతో సరఫరాదారులు కోర్టును ఆశ్రయించినా వారికి న్యాయం దక్కలేదు. కోర్టు ఆదేశాలు అమలుకాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీరు, చెట్టు పనుల విషయంలో సేమ్ సీన్. పనులు చేపట్టిన రైతులు కోర్టు తలుపుతట్టినా..ఇంకా చాలామందికి చెల్లింపులు చేయలేదు. తాజాగా వైసీపీ నేతలు సైతం తాము చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కొందరు బాహటంగానే నిరసన తెలుతున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించేందుకు సన్నద్దమవుతున్నారు. సొంత పార్టీ వారే న్యాయస్థానానికి వెళుతుండడం జగన్ సర్కారుకు ఘోర అవమానంగా విశ్లేషకులు భావిస్తున్నారు.