West Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ముగిసిన మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు దాదాపు 93 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. రికార్డుస్థాయి పోలింగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతమిది, ఇది ఓటర్ల చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో, ఈ భారీ ఓటింగ్ ఎవరికి సానుకూలమనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.
ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు..
గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి హింసాత్మక ఘటనలు 90 శాతం వరకు తగ్గుముఖం పట్టాయని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎన్నికల కమిషన్ చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సుమారు 2.5 లక్షల మంది భద్రతా బలగాలను మోహరించడం, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ పోలింగ్ నిర్వహించింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మోటార్ సైకిళ్లపై ఆంక్షలు విధించడం వంటి నిర్ణయాలు అల్లర్లను అరికట్టడంలో కీలకంగా మారాయి. కేంద్ర బలగాల సమర్థవంతమైన నిర్వహణ వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద భయాందోళనలు తొలగి, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఏర్పడింది.
మౌనంగా ఉన్న ఓటరు..
భారీ ఓటింగ్ నమోదైనప్పటికీ, ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా మౌనంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. గతంలో రాజకీయ దాడులకు గురయ్యామన్న భయంతో, బీజేపీ ఓటర్లు తమ ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బయటకు చెప్పడం లేదని కొన్ని వర్గాల సమాచారం. అలాగే, తృణమూల్ కాంగ్రెస్ అనుకూల ఓటర్లు కూడా తమ వ్యూహాన్ని బయటపెట్టకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఫలితాలు వెలువడే వరకు ఏ పార్టీకి ఎడ్జ్ ఉందనేది స్పష్టంగా చెప్పలేని స్థితి ఉన్నప్పటికీ, ఈ రికార్డు స్థాయి పోలింగ్ ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు కోరుకునే వారి సంఖ్య పెరిగిందని సూచిస్తోంది.
గతంలో కమ్యూనిస్టుల పాలన, ఆ తర్వాత తృణమూల్ హయాంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల బెంగాల్ రాజకీయ రక్తచరిత్రకు వేదికగా నిలిచింది. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం ద్వారా, ఎన్నికల ప్రక్రియను పండుగలా మార్చడంలో కమిషన్ సఫలీకృతమైంది. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ’జంగల్ రాజ్’ నుంచి ’ప్రజాస్వామ్య మార్గంలోకి’ అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.