‘‘బెంగాల్ లో దళిత ఓటర్ల శాతం 23.5! రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు స్థానాలు 68.’’ ఈ లెక్కలు చాలు.. పశ్చిమ బెంగాల్లో ఎస్సీల ప్రాధాన్యత ఎంత అన్నది చెప్పడానికి! అందుకే.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరి, దళితులు ఎవరి పక్షాన నిలవబోతున్నారు? ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
బెంగాల్ రాష్ట్రంలోని దళితుల్లో రాజ్ బోంగ్శీలు, మథువాలు, బౌరీ, బాగ్దీలు ప్రధానంగా ఉన్నారు. వీరు ఏకంగా వంద నుంచి 110 నియోజకవర్గాల్లో గెలుపును నిర్ణయించే శక్తిగా ఉన్నారు. వీరిలోనూ బోంగ్శీలు, మథువాల ప్రాబల్యం ఎక్కువ. మొత్తంగా.. ఈ దళితులను ఆకర్షించడం ద్వారా బెంగాల్లో గెలుపు జెండా ఎగరేయాలని పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
అయితే.. గతంలో ఎన్నడూలేని ఈ కుల సమీకరణాలు.. ఇప్పుడు బలంగా తెరపైకి రావడం గమనార్హం. బెంగాల్ ను దశాబ్దాల కాలం పాటించిన కమ్యూనిస్టులు.. ఏనాడూ కుల రాజకీయాలు చేయలేదు. కానీ.. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు తారస్థాయికి చేరిందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు అధికారం కోసం తీవ్రంగా యుద్ధం చేస్తున్న బీజేపీ-టీఎంసీ రెండూ దళితుల ఓట్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు.
2011లో కులాల వారీగా టిక్కెట్లు కేటాయించిన మమత.. 2016లో ఏకంగా 50 రిజర్వు స్థానాలను గెలుచుకుంది. దీంతో.. వారికి ప్రత్యేకంగా జాతి అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి, ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు వారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్రధాని మోడీ బంగ్లా పర్యటనలో భాగంగా ఒరాకండీ ఆలయాన్ని సందర్శించారు. దళిత వర్గం మథువా ఆధ్యాత్మిక గురువు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం ఒరాకండీ. వారి ఓట్లను రాబట్టేందుకే మోడీ అక్కడికి వెళ్లారనే ప్రచారం జరిగింది.
మరి, ఈ సారి 68 స్థానాలు ఎస్సీలకు రిజర్వు కాబడి ఉన్నాయి. 294 స్థానాలున్న అసెంబ్లీలో 68 స్థానాలు తక్కువేం కాదు. ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలకం అవుతాయి. అందుకే.. దళితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు టీఎంసీ, బీజేపీ నేతలు. మరి, వారు ఎవరిని కరుణిస్తారు? అన్నది చూడాలి.