Welcome back India: అమెరికా ఫస్ట్.. గ్రేట్ అమెరికా మేక్ ఎగైన్ నినాదాలతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్.. తన 2.0 పాలనలో హామీల అమలుకు ప్రపంచ దేశాలతోపాటు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లినవారిని ఇబ్బందులు పెడుతున్నారు. మొదట అక్రమంగా వెళ్లినవారిని గుర్తించి పంపించారు. ఇప్పుడు హెచ్–1బీ వీసాపై ఉంటున్నవారిపై అధిక ఫీజుల భారం మోపుతున్నారు. కొత్త హెచ్–1బీ వీసాల జారీపై ఆంక్షలు విధించారు. అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో అమెరికన్లకే మొదటి ప్రధాన్యం ఇవ్వాలని హుకూం జారీ చేశారు. యూనివర్సిటీల నిధుల్లో కోత విధించారు. వీటి ప్రభావం ఎక్కువగా భారత్, చైనాపై పడుతోంది. భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థపై ట్రంప్ పరిపాలన ఆంక్షలు విధించడం భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలకు కొత్త అవకాశాలు తెలిపింది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో స్థిరపడిన భారత మూలాల నిపుణులను దేశానికి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది దేశీయ ఆవిష్కరణలను బలపరచడానికి ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది.
పెరిగిన ట్రంప్ వేధింలు..
డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ’కాంపాక్ట్ ఫర్ అకాడమిక్ ఎక్సెలెన్స్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది యూనివర్సిటీలకు ఫెడరల్ నిధులను ఆధారాలుగా మారుస్తుంది. విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు, జాతి లేదా లింగ ఆధారిత చేరికలపై నిషేధాలు, ఫీజు ఆక్షేపణలు వంటి షరతులు విధించబడుతున్నాయి. హార్వర్డ్ వంటి ప్రముఖ సంస్థలకు బిలియన్ల డాలర్ల గ్రాంట్లు ఆపేశారు, ఇది విద్యా స్వాతంత్య్రానికి ఆటంకం కలిగిస్తోందని విమర్శకులు అంటున్నారు. ఈ మార్పులు భారతీయ నిపుణులకు ఉద్యోగ అవకాశాలను తగ్గించాయి. దీంతో భారత్ వారిని తిరిగి తీసుకురావడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ కొత్త పథకం విదేశాల్లో విజయవంతమైన భారతీయ మూలాల ’స్టార్ ఫ్యాకల్టీ’ని లక్ష్యంగా చేసుకుంది. వారు దేశంలో నిర్దిష్ట కాలం పరిశోధన చేసి, ఐఐటీలు, డీఎస్‌టీ, డీబీటీ కింది ల్యాబ్‌లలో పూర్తి స్థిరపడేలా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రణాళిక క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత అమలు అవుతుంది.
ప్రిన్సిపల్ అడ్వైజరీ నాయకత్వంలో..
ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం ఈ ప్రక్రియకు నాయకత్వం వహిస్తోంది. ఉన్నత విద్యా శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ నిపుణులతో సమావేశాలు జరుగుతున్నాయి. ఐఐటీ డైరెక్టర్లు చర్చల్లో పాల్గొన్నారు. ప్రారంభంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్)లో 12–14 ముఖ్య రంగాలపై దృష్టి పెట్టనున్నారు. జాతీయ అభివృద్ధికి కీలకమైన ఈ రంగాలు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఎంపిక చేయబడ్డాయి.
ప్రతిభ ఆకర్షణ..
ఈ పథకం భారత్‌ను ప్రపంచ ప్రతిభా ఆకర్షణలో ముందు నిలుపుతుంది. విదేశాల్లో ఉన్న నిపుణులను తిరిగి తీసుకురావడం ద్వారా పరిశోధనా సామర్థ్యాన్ని పెంచి, సహకారాలను బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలిక బంధాలు ఏర్పడటం ద్వారా దేశీయ విద్యా వ్యవస్థకు గ్లోబల్ మాన్యం పెరుగుతుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ మాజీ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్ ప్రకారం, ‘భావోద్వేగ సాన్నిహిత్యం, సులభమైన అమలు‘ ద్వారా ప్రతిభలను ఆకర్షించవచ్చు. ప్రభుత్వం నుంచి లేదా విద్యా శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది అనిశ్చితిని పెంచుతోంది. భారత్‌లో ప్రొఫెసర్ వేతనాలు (సుమారు 38 వేల డాలర్లు) అమెరికా (1.3–2 లక్షల డాలర్లు)తో పోలిస్తే తక్కువగా ఉండటం, బ్యూరోక్రటిక్ అడ్డంకులు, పరిమిత నిధులు, దీర్ఘకాలిక కాంట్రాక్టుల లోపం వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని అధిగమించకపోతే, పథకం పరిమిత ప్రభావానికి మాత్రమే పరిమితమవుతుంది. ఈ ప్రణాళిక భారత్‌లో విద్యా–పరిశోధనా రంగానికి ఒక కీలక మలుపు. కానీ అమలు బలోపేతంపై ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ పోటీలో భారత్ ముందుండాలంటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.