Let Follow Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొలదీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు దూకుడు పెంచాయి. అన్నివర్గాల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వారి మద్దతు కూడగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈసారి కాపులు అధికార వైసీపీకి షాకిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాపులను తమవైపు తిప్పుకునేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా జగన్ కాపునేస్తం నిధులను విడుదలచేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కాపులకు కాపు కాసేది జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని.. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను గుంపుగుత్తిగా ఆమ్మేస్తాడని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ను నమ్మొద్దని.. కాపులకుఅన్నివిధాలా న్యాయం చేసింది జగనేనన్నారు. కార్యక్రమం మొత్తం పవన్ పైనే మంత్రితో పాటు ఇతర నాయకుల విమర్శలు కురిపించారు. అటు జగన్ కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు.

ఎలా నమ్మాలి?
అయితే జగన్ తో పాటు మంత్రులు పవన్ పై చేస్తున్న వ్యాఖ్యాలపై కాపులు మండిపడుతున్నారు. అసలు జగన్ ను ఎందుకు నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు సర్కారు కేటాయించిన ఐదు శాతం రిజర్వేషన్ ను రద్దుచేశారని గుర్తుచేస్తున్నారు. రిజర్వేషన్ల అంశం తన పరిధిలోకి రాదని పక్కకు తప్పుకున్న విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. వంగవీటి మోహన్ రంగాను తూలనాడిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన గౌతమ్ రెడ్డికి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించారన్నారు. తొలుత విమర్శలు రావడంతో గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. అటువంటి వ్యక్తికి తిరిగి పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. వంగవీటి తనయుడు రాధాను దారుణంగా మోసం చేశారని గుర్తుచేస్తున్నారు. రాధా సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ అడిగితే మొండి చేయి చూపారని.. పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెట్టారని ఆరోపిస్తున్నారు. విజయవాడ జిల్లాకు వంగవీటి పేరును పెట్టాలన్న ప్రతిపాదనను సైతం పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. కనీసం కాపుల నుంచి వచ్చిన డిమాండ్ ను కనీ స పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు రంగా జయంతి వేడుకలు నిర్వహించారని.. అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం మరిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

సంక్షేమానికి మంగళం…
వైసీపీ సర్కారు కాపు సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసింది. పథకాల్లో భారీగా కోత విధించింది. ఒక్క కాపు నేస్తం తప్పించి మిగతా పథకాలన్నింటినీ రద్దు చేసింది. విద్యోన్నతి, విదేశీ విద్య పథకాలకు మంగళం పలికింది. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు కాపులపై ఎనలేని ప్రేమను కనబరిచారు. అధికారంలోకి వస్తే కాపుల బతుకులనే మార్చుతానని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్లతో వారి ఆర్థిక స్థితిగతులను మార్చుతానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రూటు మార్చారు. అప్పటివరకూ చంద్రబాబు సర్కారు అందించిన పథకాలను సైతం రద్దుచేశారు. కాపు కార్పొరేషన్ అయితే ఏర్పాటుచేశారు కానీ.. వాటికి నిధులు, విధులు లేకుండా చేశారు.
వాటిని మరిచిపోయారా?

కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను కత్తి మహేష్, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళీ తిట్టించిన విషయాన్ని కాపులు మరచిపోలేకపోతున్నారు. ఇక జగన్ కు పెద్దపాలేరునని కాపు సామాజికవర్గాన్ని కించపరిచేలా పేర్ని నాని వ్యాఖ్యలను కూడా గుర్తుచేస్తున్నారు. అటు అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, కొట్టు సత్యానారాయణ, ఆళ్ల నాని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్ నాథ్ లతో తిట్టిన తిట్టు తిట్టించకుండా తిడుతున్న వైనం ఇప్పటికీ కాపుల మదిలో మెదులుతోంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోమని కాపులు జగన్ కు గట్టి హెచ్చరికలైతే మాత్రం పంపుతున్నారు.ముఖ్యంగా పేర్ని నానితో సొంత కులాన్నే తిట్టించిన జగన్ కు గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జగన్ ఎన్ని తాయిలాలు ప్రకటించినా ఈసారి మాత్రం మెజార్టీ కాపులు పవన్ వెంట నడిచే పరిస్థితులు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.