ఏపీలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని.. పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలపై నిర్ణయం తీసుకునేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో అత్యవసరంగా సమావేశమైంది. అనంతరం పార్టీ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు చంద్రబాబు.
కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ రబ్బర్ స్టాంపుగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు భారీగా పెరుగుతున్నాయని, అవన్నీ ప్రభుత్వం దౌర్జన్యంగా చేయిస్తున్న ఏకగ్రీవాలేనని అన్నారు. 2014 పరిషత్ ఎన్నికల్లో రెండు శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, ఇప్పుడు మాత్రం 24 శాతం ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు. జడ్పీటీసీలు అప్పుడు ఒక శాతం ఏకగ్రీవమైతే.. ఇప్పుడు 19 శాతం అయ్యాయని చెప్పారు. ఇవన్నీ బలవంతపు ఏక్రగీవాలేనని బాబు అన్నారు.
పార్టీలతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి, ముందే ఇచ్చారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా సాగుతాయని తాము భావించట్లేదని అన్నారు. ఈ అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై జాతీయ స్థాయిలో పోరాడుతామని చెప్పారు.