Kerala Wayanad Landslide: దేవ భూమి కేరళపై ప్రకృతి మరోమారు కన్నెర్రజేసింది. నాలుగేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. ఊళ్లు.. ఏరులు ఏకమయ్యాయి. నది ఏదో ఊరు ఏదో తెలియని పరిస్థితి. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. వందల మంది గల్లంతయ్యారు. తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడడంతో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. 600 మంది వలస కూలీల ఆచూకీ లేకుండా పోయింది. ఇంతటి ఘోర కలికి… అరేబియా సముద్రం వేడెక్కడమూ ఓ కారణమని నిపుణులు భావిస్తున్నారు. స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడటం, తద్వారా ఆకాశానికి చిల్లు పడినట్లు.. క్లౌడ్ బరస్ట్ అయినట్లుగా అతిభారీ వర్షాలకు కారణమయ్యిందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాలకు ప్రకృతి సౌంర్యానికి నిలయం దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. నిన్నటి వరకు టూరిస్టులను ఆకర్షించిన ప్రదేశాలు ఇప్పుడు కళావిహీనంగా మారాయి. కేరళపై కొన్నేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. కరోనా సమయంలో దేశంలోనే తొలి కేసు కేరళలోనే నమోదైంది. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ నుంచి లక్షల మంది వివిద దేశాల్లో స్థిరపడ్డారు. ఇక వైద్య రంగంలో ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. అయినా ఇక్కడ వైరస్‌లు, వ్యాధులు విజృంభిస్తున్నాయి. కరోనా, బర్డ్‌ఫ్లూ, నిఫా ఇలా వరుస వైరస్‌లు కేరళవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి.
24 గంటల్లో 10 సె.మీ వర్షపాతం..
కేరళ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరుస కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో కేరళలోని గ్రామీణ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రాష్ట్రాంలోని 70 శాతం జిల్లాల్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. కొట్టయాంం తదితర జిల్లాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతంలో ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా ఉండటం, ఉపరితల ద్రోణి కారణంగా కాసార్రోడ్, కన్నూర్, వయనాడ్, కౌయ్కేడ్, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోందని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్‌స అండ్ టెక్నాలజీకి చెందిన రాడార్ పరిశోధన కేంద్రం డైరెక్టర్ అభిలాష్ తెలిపారు.
2019 తరహాలోనే..
రుతుపవనాల ప్రభావంతో కేరళలో రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేల మొత్తం తేమగా మారింది. ఇదే సమయంలో వేడిగాలుల కారణంగా అరేబియా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడింది. సుదీర్ఘ సమయం పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈ మేఘాల కారణంగా వయనాడ్, కొలికోడ్, మలప్పురం, కన్నూర్‌లలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. 2019లో రాష్ట్రంలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయన్నాయని వాతావరణ నిపుణులు పన్కొంటున్నారు.
ముందే గుర్తించిన శాస్త్రవేత్తలు..
అరేబియా సముద్ర తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాలు ఏర్పడడాన్ని శాస్త్రవేత్తలు ముందే గుర్తించారు. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కుతుందని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి కారణంగానే కేరళ సహా ఈ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరమైందిగా మారినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇలా వాతావరణంలో అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడటానికి కారణమని చెబుతున్నారు. ఈ రకమైన వర్షపాతం గతంలో ఉత్తర కొంకణ్ ప్రాంతంలో సాధారణంగా కనిపించేదన్నారు.