
తెలంగాణ,ఆంధ్ర్రప్రదేశ్ మధ్య అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న నాయకులు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. నీటి కోసం మాటలు మొదలు పెట్టారు. ఇది ఎంత వరకు దారి తీస్తుందో తెలియదు. కానీ రాష్ర్టాల ప్రయోజనాలు మాత్రం కాపాడే విధంగా ఉంటాయో లేదోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు పాకులాడుతున్నారు. ఇందులో అధికార పార్టీలే లాభపడతాయనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఏపీలో నీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ నిక్కచ్చిగా ఉంటాడనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయోనని అనుమానం అందరిలో మెదులుతోంది.
బీజేపీ,జనసేన పార్టీలు ఈ విషయంలో మౌనంగానే ఉంటున్నాయి. ఏం మాట్లాడితే ఎటు పోతుందోననే భయంతో ఇరు పార్టీలు నోరు విప్పడం లేదు. రాయలసీమకు నీళ్లందించేందుకు పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయంపై కూడా తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడలేదు. ఇందులో రాజకీయంగా ఇబ్బంది పడేది టీడీపీ మాత్రమే అనే సంగతి అందిరికి తెలుసు. దీనిపై కడప జిల్లా నేతలు పాజిటివ్ గా మాట్లాడితే చంద్రబాబు వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల విషయంలో ఎవరు మాట్లాడొద్దని అధినేత హుకుం జారీ చేశారు.
జగన్, కేసీఆర్ ఆడుతున్న డ్రామాలో సాగునీటి ప్రాజెక్టుల విషయం ఒకటని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వారిద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాజోలిబండ వ్యవహారం రెండు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజోలుబండ దగ్గర కొత్తగా ఏపీ ఎనభై వేల క్యూసెక్కుల నీటిని తీసుకు వెళ్తుందని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు.
మాకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని, కొ్తగా ప్రాజెక్టులు కట్టడం లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. పాత ప్రాజెక్టులకు మరమ్మతులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు. దీనిపై రగడ రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదం వైసీపీకి అడ్వాంటేజిగా మారినా టీడీపీ మాత్రం నోరు మెదపలేని పరిస్థితి. బీజేపీ, జనసేన కూడా దీనికి దూరంగా ఉండడం విశేషం.