Bengaluru water crisis: కరువు కష్టాలు: నీళ్లు లేవు.. వారానికి ఒకసారే స్నానం..

మార్చి నెలలోనే బెంగళూరు వాసులు నీళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్నారంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బోర్లు ఎండిపోవడంతో బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది.

Written By: Neelambaram, Updated On : March 13, 2024 3:04 pm

Bengaluru water crisis

Follow us on

Bengaluru water crisis: బోర్లు అడుగంటాయి. చెరువులు ఎండిపోయాయి. నదులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉన్న భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడి ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తెరపైకి అనేక నిబంధనలు తీసుకొచ్చింది. వాటర్ సర్వీసింగ్ సెంటర్లను మూసివేసింది. నీళ్లను అడ్డగోలుగా వాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తాగే నీటికి కటకట.. స్నానం వారానికి ఒక్కసారే.. ఇది ప్రస్తుతం దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నెలకొన్న పరిస్థితి.

మార్చి నెలలోనే బెంగళూరు వాసులు నీళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్నారంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బోర్లు ఎండిపోవడంతో బెంగళూరులో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. స్థానికులు అవసరాల కోసం ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో ట్యాంకర్ నిర్వాహకులు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఒక ట్యాంకర్ 600 నుంచి 1000 వరకు లభ్యమయ్యేది. కానీ ఇప్పుడు ఆ ధర ఏకంగా రెండు వేలకు పెరిగిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరలు తగ్గించాలని హెచ్చరించడంతో ట్యాంకర్ నిర్వాహకులు నగరానికి రావడమే మానేశారు. దీంతో ప్రజలు అవసరాల కోసం ఆర్.ఓ ప్లాంట్ల మీద ఆధారపడుతున్నారు. అక్కడ కూడా ఒక్కొక్కరికి ఒక్కో క్యాన్ మాత్రమే ఇస్తున్నారు. ప్లాంట్ల వద్ద భారీగా క్యూ ఉండటంతో, నీటి కోసమే గంటలపాటు నిలబడాల్సి వస్తోందని బెంగళూరు నగరవాసులు అంటున్నారు. స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి తగినంత నీరు కూడా లభించడం లేదని వారు వాపోతున్నారు. వంట చేసుకోవడానికి కార్పొరేషన్ నీటిని కాచి, వడపోసి వినియోగిస్తున్నామని చెబుతున్నారు.. గత మూడు నెలలుగా తాము ఈ ఇబ్బంది పడుతున్నామని.. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు (బీఎం డబ్ల్యూ ఎస్ఎస్ బీ) అధికారులకు ఫోన్ చేసిన పట్టించుకోవడంలేదని అంటున్నారు.. నీటి కరువు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నన్ను వైట్ ఫీల్డ్ లోని ఓ హౌసింగ్ సొసైటీ కఠిన నిర్ణయం తీసుకుంది.. నీటి వినియోగాన్ని 20% తగ్గించకుంటే 5000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

తాగునీటి కరువు నేపథ్యంలో.. ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంటామని ఉప ముఖ్యమంత్రి శివకుమార్ హెచ్చరించారు.. సమస్య పరిష్కారానికి అన్ని వాటర్ ట్యాంకులు తమ వివరాలను బెంగళూరు నగరపాలక కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు. వారందరితో మంగళవారం సమావేశమయ్యారు… మరోవైపు నీటి కొరతను నివారించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. కాగా, రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 219 తాలూకాలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వం ఇటీవల నివేదికలో పేర్కొంది.