
ఇన్నాళ్లు బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతూ వస్తున్న వైసీపీ.. ఒక్కసారిగా స్వరం మార్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తన రాజకీయ భవిష్యత్ కోసం కేంద్రం ఏ బిల్లును తీసుకొచ్చినా సపోర్టు చేస్తూ వచ్చిన జగన్.. ఇప్పుడు కేంద్రంపై వ్యూహాత్మక దాడిని ప్రారంభించినట్లుగా అర్థమవుతోంది. ఈ దాడి వెనక రాజకీయ వ్యూహాలు నడిపే ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. వైసీపీ క్రమక్రమంగా బీజేపీపై స్వరం పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా అని కేంద్రంతో సమరానికి సిద్ధమైపోయినట్లుగా కాదు. ఆచితూచి అడుగులు వేస్తూనే అదను చూసి కొట్టాలనుకుంటోంది.
తాజాగా పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని ఇరకాటంలో పెట్టే ఎత్తుగడలతో కదులుతోంది. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభపక్షం నేత మిథున్ రెడ్డి మాటలను బట్టి చూస్తే అంశాల వారీగా విభేదిస్తామనే సంకేతాలు పంపించారు. ఇంతవరకూ అనేక విషయాల్లో కేంద్రానికి బేషరతుగా మద్దతు పలికిన వైసీపీ నాయకత్వం స్టాండ్ మార్చుకుంటోంది. ఇకపై అదేం కుదరదని చెప్పాలనుకుంటోంది. తాము ఎంతగా మద్దతిస్తున్నప్పటికీ అంతటి సానుకూలత కేంద్రం నుంచి రావడం లేదనేది వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇకపై బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశాలను చేజార్చుకోకూడదని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్రం కొన్ని విషయాల్లో రాష్ట్రాన్ని ఏ మాత్రం ఉపేక్షించకుండా తీసి పారేస్తోందనే భావన ప్రజలతోపాటు వైసీపీ నేతల్లోనూ వచ్చింది. అవసరమైన సందర్భాల్లో దీటుగా సమాధానం చెప్పేందుకు, నిలదీసేందుకు ఇటీవలనే అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాంతో కేంద్రాన్ని వివిధ అంశాలపై సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎంపీలు. అదే సమయంలో దాడిని తక్షణం ఎక్కుపెట్టినట్లుగా కాకుండా వాజ్‌పేయి పాలనతో పోలుస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వ్యూహం అనుసరిస్తున్నారు.
నేరుగా కాకుండా బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన వాజ్‌పేయి పాలనను, ఆలోచనను ఆదర్శంగా చూపుతూ మోడీని నిందించాలనేది వైసీపీ ఆలోచన. అందుకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై తన వ్యతిరేకతను స్పష్టంగా చెప్పేశారు విజయసాయి రెడ్డి. నిజానికి ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నష్టమేమీ లేదు. అయినా.. ప్రతిపక్షాలతో సంఘీభావం ప్రకటించేందుకు వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లోనూ జగన్ తో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అగ్రనాయకత్వంపై పీకే మండిపడుతున్నారు. వ్యక్తిగతంగా సైతం మోడీకి దూరమయ్యారు.
బలమైన వైసీపీని కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వినియోగించ వచ్చనేది పీకే ఆలోచనగా తెలుస్తోంది. కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న అంశంలో ఆయన విలువైన సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైసీపీ. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో సైతం ఢోకాలేదనే వాదన వినవస్తోంది. ఈ స్థితిలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ సహకారం తప్పనిసరి. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ నూరిపోశారని వైసీపీలో చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలతో గొంతు కలిపితేనే కేంద్రం జాగ్రత్తగా ఉంటుందనేది పీకే వ్యూహమని అంటున్నారు. దాంతో వైసీపీ తాజాగా బీజేపీపై గురిపెడుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. ముందున్న తిరుపతి ఉప ఎన్నికలోనూ కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా హామీని ప్రతి సందర్భంలోనూ ప్రస్తావించాలని.. స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ, పోలవరం నిధులు, రైల్వే ప్రాజెక్టుల పెండింగ్ వంటి అంశాలన్నిటినీ ప్రచారాంశాలుగా మలచుకోవాలని వైసీపీ యోచిస్తోంది. పార్లమెంటులో నిలదీయడంతోపాటు ఆ ప్రకంపనలు తిరుపతిలో వినిపించేలా చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీకి సెంట్రల్‌లో గడ్డు పరిస్థితులు కనిపిస్తుండడంతో వైసీపీ ముందుగానే తప్పుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.