
భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా ఆక్రమణకు చెక్ చెబుతూ భారత సైన్యం దండెత్తిందని అందరూ అనుకున్నారు. కానీ చైనా పెద్ద ఎత్తున భారత భూభాగాన్ని ఆక్రమించిందని తాజాగా తెలిసింది.
సరిహద్దుల్లో చీటికి మాటికి కవ్విస్తున్న చైనాకు భారత సైన్యం నిన్న గట్టి షాక్ ఇచ్చింది. చైనా బలగాలను వెనక్కినెట్టిన భారత సైనికులు వివాదాస్పదమైన సౌత్ ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు భారత ఆధీనంలోకి వచ్చింది.
సౌత్ ప్యాంగ్యాంగ్ ను స్వాధీనం చేసుకున్న భారత జవాన్లు ప్రస్తుతం అక్కడ భారీగా మోహరించారని సమాచారం. చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడినా గట్టిా బుద్ది చెబుతామని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా చీటికి మాటికి మనవైపు దూసుకొస్తున్న చైనా ప్యాంగ్యాంగ్ సరస్సు మీదే కన్నేసింది. ఇప్పుడు భారత బలగాలు దీన్ని స్వాధీనం చేసుకోవడంతో చైనాకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇది భారత్ కు అతిపెద్ద విజయం అంటున్నారు. చైనా బలగాలు, ట్యాంకులు, ఇతర వాహనాల కదలికలను ఈ ప్రాంతం నుంచి భారత సైన్యం గమనించేందుకు వీలుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎత్తైన ప్రాంతం భారత బలగాల ఆధీనంలో ఉండడంతో చైనా చేపట్టే సైనిక చర్యలు మనకు తెలిసిపోతాయంటున్నారు.
చైనా ఇప్పటికే అక్కడ రోడ్డును నిర్మించి బలగాలు, యుద్ధ వాహనాలు తరలిస్తోంది. ఈ కీలకమైన ప్రాంతం భారత్ కు దక్కడం మన విజయంగా అభివర్ణిస్తున్నారు.
అయితే ఇప్పటికే చైనా లఢఖ్ వద్ద ఎల్.ఏ.సీ వెంబడి పలు ప్రదేశాల్లో భారత్ కు చెందిన దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించినట్టు కేంద్ర అధికారి తెలిపారు. డెప్పాంగ్ నుంచి చుశుల్ వరకు ఈ ఆక్రమణలు జరిగాయని వివరించారు. ఈ క్రమంలోనే భారత సైన్యం ఇప్పుడు చైనా సైనికులను వెనక్కి జరుపుతూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని తెలిసింది.