AP Capital Visakha: పాలనా రాజధానిగా విశాఖను అన్నివిధాలా సిద్ధం చేస్తున్నారా? ముంబాయి తరహాలో జాతీయ స్థాయిలో విశాఖను ఫోకస్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సీఎం జగన్ ఈ రోజు విశాఖలో అడుగుపెట్టనున్నారు. జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద సాగర నగరమైన విశాఖలో బీచ్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 25 వేల మంది వలంటీర్లతో భారీగా కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో జాతీయ స్థాయిలో అందరూ విశాఖ వైపు చూసేలా భారీగా ప్లాన్ చేశారు. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ సహకారంతో పార్లె ఇండియా కంపెనీ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. నావల్ కోస్ట్ బ్యాటరీ నుంచి భీమిలి బీచ్ వరకూ 29 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. బీచ్ లో వ్యర్థాలు, చెత్తను తొలగించనున్నారు.

పార్లె ఇండియాతో ఒప్పందం..
పార్లె ఇండియా కంపెనీ కార్యక్రమాన్ని తలపెట్టింది. పార్లె ఫర్ ది ఓషన్స్ పేరిట నిర్వహిస్తోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగంతో పాటు జీవీఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. 29 కిలోమీటర్ల బీచ్ ను 40 జోన్లుగా కేటాయించారు.ఒక్కో జోన్ కు 500 నుంచి 600 మంది వలంటీర్లను నియమించారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న జోన్లలో 1000 మంది వలంటీర్లను ఏర్పాటుచేశారు. జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగం, ఈస్ట్ నావల్ కమాండ్, స్వచ్ఛంద సంస్థలు, విశాఖ బీచ్ వాకర్స్ క్లబ్బులు, కాలనీ వెల్పేర్ అసోసియేషన్లు, విద్యార్థులను కార్యక్రమంలో భాగస్థులు చేయనున్నారు. వలంటీర్లకు గ్లౌస్లు, టీషార్టులు, మంచినీరు, ట్రాష్ బ్యాగ్స్ అందించనున్నట్టు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

గట్టి సవాల్ విసరాలని..
విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి వైసీపీ ప్రభుత్వం అనేక కారణాలు చూపుతూ వచ్చింది. విపక్షాలు ఆందోళన చేసినా వెరవలేదు. ముంబాయి తరహాలో విశాఖ మరింత అభివృద్ధి చెందడానికి అవకాశమున్న దృష్ట్యా తాము పాలనా రాజధానిగా ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చింది. కానీ ఇంతవరకూ రాజధాని మార్చడం సాధ్యం కాలేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్లో మరింత నమ్మకం కలిగించేందుకు ఈ తరహా కార్యక్రమానికి పూనుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకుగాను ముందుగా ప్రభుత్వం పార్ల ఇండియా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి విశాఖ రాజధాని విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పాలని చూస్తోంది. బీచ్ క్లీనింగ్ పేరిట అటు సామాజిక సేవాపరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవాలన్న ఆలోచనతో వినూత్న కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.