JanaSena: ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒక అంచనా. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 34 నియోజకవర్గాలున్నాయి. అందులో అత్యధిక మెజార్టీ స్థానాలను సొంతం చేసుకున్న పార్టీయే ఇప్పటివరకూ ఏపీలో అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికల్లో అధికార వైసీపీ దాదాపు స్వీప్ చేసినంత పనిచేసింది. 34 నియోజకవర్గాలకు గాను 28 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. శ్రీకాకుళంలో రెండు, విశాఖలో నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. విజయనగరంలో కనీసం బోణీ కూడా తెరవలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే అదీ లేదు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ఉన్న స్థానాలను నిలబెట్టుకోవడం మాట అటుంచి.. దారుణ పరాజయం వైపు అడుగులేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగని టీడీపీ పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదు. జనసేనతో కలిసి పోటీచేస్తే మాత్రం ఆ పార్టీ గౌరవప్రదమైన స్థానాలు సొంతం చేసుకునే అవకాశముంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ, టీడీపీలను వెనక్కి నెట్టి జనసేన ఉత్తరాంధ్రలో బలమైన శక్తిగా మారిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 34 స్థానాల్లో దాదాపు సగం నియోజకవర్గాలు జనసేన ఖాతాలో పడే చాన్స్ ఉంది.

జనసేనకు అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి విశాఖ జిల్లా ఒకటి. ఇక్కడ పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా కాపు సామాజికవర్గం ఎక్కువ. అందుకే గత ఎన్నికల్లో పవన్ గాజువాక నుంచి పోటీచేశారు. కానీ ఓటమే ఎదురైంది. అయితే ఇక్కడి ఫలితంతో పవన్ ఎటువంటి నిరాశ చెందకున్నా.. అక్కడి ప్రజల్లో మాత్రం పవన్ ను వదులుకొని తప్పుచేశామన్న పశ్చాత్తాపం కనిపిస్తోంది. మరోసారి ఆ తప్పు చేయమంటూ బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ జిల్లాలో గాజువాక, అనకాపల్లి, పాయకరావుపేట, విశాఖ ఉత్తరం, తూర్పు, పశ్చిమ, భీమిలి నియోజకవర్గాల్లో జనసేన బలమైన శక్తిగా అవతరించింది. అక్కడ ఆ పార్టీకి బలమైన నాయకత్వం కూడా ఉంది. టీడీపీతో కూటమి కట్టినా.. ఒంటరిగా పోటీచేసినా అక్కడ జనసేన గెలుపొందే అవకాశమున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి తూర్పుకాపు సామాజికవర్గం ఎక్కువ. గత ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాలకుగాను వైసీపీ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం జనసేన ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో నాలుగు నుంచి ఐదు స్థానాలను జనసేన దక్కించుకునే చాన్స్ ఉంది. ప్రధానంగా నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోట, సాలూరు నియోజకవర్గాల్లో జనసేన అజేయమైన శక్తిగా మారింది. అక్కడ బలమైన నాయకత్వాలను ఏర్పాటుచేసుకుంది. అధికార పక్షంపై వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఫెయిల్యూర్స్ జనసేనకు కలిసి వస్తున్నాయి. ఇక్కడ తూర్పుకాపులు, ఇతర వెనుకబడిన వర్గాల వారు జనసేనకు అండగా నిలిచే చాన్స్ ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో జనసేన పట్టును పెంచుకుంది. పవన్ ఆది నుంచి ఇక్కడి సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రపంచ వ్యాప్తం చేసిన విషయం తెలిసిందే. అటు తితలీ తుపాను బాధితులను ఆదుకోవడంలో సైతం ముందు వరుసలోనిలిచారు. శ్రీకాకుళం భాష, యాస అంటేపవన్ కు మక్కువ. అందుకే తన సినిమాల్లో శ్రీకాకుళం జానపదాలకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఇటీవల జనసేన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యువశక్తి వేదికను రణస్థలంలో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమం అనంతరం జనసేన మరింత జోష్ మీద ఉంది. జిల్లాలో ఎచ్చెర్ల, రాజాం, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే జనసేనకు చాన్స్ ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ తూర్పుకాపులు, మత్స్యకారులు, ఇతర వెనుకబడిన వర్గాల వారు జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయి.