Vijaya Sai Reddy: ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? తమని కాదని అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారా? అంటే వైసీపీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి నియమించిన నాటి నుంచే వారంతా కీనుక వహిస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకులు ఇప్పడు సైలెంట్ అవ్వడం ఇదే కారణమని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్ నాయకులకు కొదువ లేదు.
జిల్లాల్లో పట్టున్న నాయకులను పక్కన పడేసి కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సీనియర్ నేత, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు మంచి వాగ్ధాటి ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేక అనుచరగణం ఉంది. అటువంటి నాయకుడ్ని జగన్ తన క్యాబినెట్లో తీసుకోలేదు. వ్యూహాత్మకంగా ఆయన సోదరుడు ధర్మాన క్రిష్ణదాసును మంత్రి పదవి కట్టబెట్టారు. సమాంతరంగా మరో నాయకుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను శాసనసభ స్పీకర్ గా నియమించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ సీదిరి అప్పలరాజును కేబినెట్లోకి తీసుకున్నారు. నామినెటెడ్ పోస్టుల్లో సైతం ధర్మాన ప్రసాదరావు సిఫారసులను పక్కన పెట్టారు. అయితే దీని వెనుక ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్న అనుమానాలు ధర్మాన ప్రసాదరావు అనుచరుల్లో ఉంది. అంతర్గత సమావేశాల్లో వారుఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. వైఎస్ హయాంలో కీలకమైన శాఖలకు మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పోల్చుకుంటే విజయసాయిరెడ్డి చాలా జూనియర్. కానీ సీన్ మారిపోయింది. ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా ధర్మాన ప్రసాదరావు మిగిలిపోయారు. ఆయన విభేధించే నాయకులకు పెద్దపీట వేస్తూ వచ్చారు.
Also Read: BJP vs TRS: కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ ‘తీర్మానాల’ పోరు.. ఫలిస్తుందా?
అందులో భాగంగానే టెక్కలి నియోజకవర్గ నేత దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన ప్రసాదరావు నాయకత్వాన్ని విభేదించేవారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో సైతం వీరిద్దరి మధ్య పొసిగేది కాదు. కానీ అప్పట్లో వైఎస్ ధర్మాన ప్రసాదరావును ప్రాధాన్యతనిచ్చారు. కానీ జగన్ మాత్రం ధర్మానను కొంత దూరం పెట్టారు.నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముందుగా కుటుంబంలో చీలిక తెచ్చారు. సోదరుడు క్రిష్ణదాస్ కు ముందుగా రెవెన్యూ శాఖను అప్పగించారు. అంతటితో ఆగకుండా డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. అయితే ఈ పరిణామాల వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్న అనుమనాలు ధర్మాన ప్రసాదరావులో ఉన్నాయి. అందుకే విజయసాయిరెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనల్లో సైతం ధర్మాన ప్రసాదరావు ఎప్పుడు కనిపించిన దాఖలాలు లేవు.
విజయనగరం జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కేబినెట్లో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాం మాదిరిగా స్వేచ్ఛ లేకుండా పోయింది. కేవలం తన చీపురుపల్లి నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. కుటుంబంలో ఇన్ని పదవులు ఉన్నా..బొత్స మాత్రం క్రయాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. దీని వెనుక కూడా ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్న అనుమానాలున్నాయి. కుటుంబంలో విభజించు పాలించు అన్నచందగా చీలికలు తెచ్చారన్న ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో బొత్స మరో సోదరుడు లక్ష్మణరావు జోక్యం చేసుకోవడంపై ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బాహటంగానే తప్పు పడుతున్నారు. దీనికి బొత్స సత్యనారాయణే కారణమని ఆరోపిస్తున్నారు. ఆయన ఎంపీ విజయసాయిరెడ్డిని ఆశ్రయించారు.
దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. మరో వైపు మామ బొత్సను కాదని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సొంతంగా ఎదగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన విజయసాయిరెడ్డికి దగ్గరయ్యారన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి. మరోవైపు విజయసాయిరెడ్డి బొత్స వ్యతిరేకులుగా ముద్రపడిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిలను ప్రొత్సహిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనపై విజయసాయిరెడ్డి పెత్తనాన్ని మంత్రి బొత్స సహించలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తెలియజేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తనను కేబినెట్ నుంచి తప్పిస్తే హస్తినా రాజకీయాల వైపు వెళ్లి తన మార్కును చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు విజయసాయిరెడ్డిపై ప్రతాపం చూపాలని భావిస్తున్నారు.
విశాఖ జిల్లాలో కూడా విజయసాయి ప్రాధాన్యతను అక్కడి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పేరుకే అధికార పార్టీలో ఉన్నాము తప్పించి తమకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారితో పాటు టీడీపీ నుంచి కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు అదే బాధను వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలపై కొత్తగా చేరిన వారితో, కొత్తగా చేరిన వారిపై పాత నాయకులతో కలహాలు వెనుక విజయసాయి పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లా నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు.
అటు నగరం, ఇటు రూరల్ జిల్లా నుంచి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మిగతా జిల్లాలకు ఇద్దరు మంత్రులు ఉన్నా విశాఖకు వచ్చేసరికి అధిష్ఠానం మొండిచేయి చూపింది. కేవలం విజయసాయిరెడ్డి ఉండడం వల్లే జిల్లాకు మరో మంత్రి పదవి రాకుండా పోయిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. పైగా నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా వ్యవహరించ లేకపోతున్నామన్న బాధ వారిని వెంటాడుతోంది. అన్ని వ్యవహారాల్లో విజయసాయి జోక్యం పెరుగుతుండడం, సమాంతరంగా కొంతమంది నాయకులను ప్రొత్సహిస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ , డీఆర్సీ సమావేశంలో విజయసాయి సమక్షంలోనే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పరోక్షంగా వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Also Read: Amit shah vs Prashant Kishor: అమిత్ షా, పీకే వ్యూహాలకు గుజరాత్ వేదిక కానుందా?