Vemireddy Prabhakar Reddy: వైసీపీలో ఆ నలుగురులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. జగన్ కు ఇష్టమైన నాయకుల్లో ఈయన ఒకరు. సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ కు మూల స్తంభాలుగా ఉన్నారు. అయితే ఇందులో ఒక పిల్లర్ గా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోరు పారేసుకోవడంతో పాటు.. వైసిపి హై కమాండ్ పెద్దల తీరు నచ్చక ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
నెల్లూరు జిల్లాలో వైసిపికి గడ్డు పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఫలితాలు వచ్చే ఛాన్స్ లేదు. ఈ తరుణంలో జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు ఒప్పించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైలెంట్ కావడం పొలిటికల్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అసలు ఆయన ఎంపీగా పోటీ చేసే ఉద్దేశ్యం ఉందా? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన భార్య ప్రశాంతి రెడ్డి సైతం పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. టీటీడీ దేవాలయాలు, ఆస్తుల అడ్వైజరీ కమిటీ అధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్నారు. అంతకుముందు టీటీడీ సభ్యురాలుగా సైతం బాధ్యతలు స్వీకరించారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన నేతగా వేమిరెడ్డి ఉండేవారు. అయితే కొద్ది రోజుల కిందట ఓ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి దంపతులపై అనవసరంగా నోరు పారేసుకున్నారు. దీంతో వేమిరెడ్డి ఇటువంటి రాజకీయాలకు నేను తట్టుకోలేనని భావించి వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
అయితే వేమిరెడ్డి వెనుక జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలో ఓ రకమైన వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో అంతా బాగుందని జగన్ చుట్టూ ఉన్న కోటరీ చెబుతోంది. కానీ చాలా వరకు లోపాలు ఉన్నాయని.. సరిదిద్దుకోకపోతే మూల్యం తప్పదని చాలాసార్లు వేమిరెడ్డి జగన్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడూ నెగిటివ్ తో మాట్లాడుతున్నారని కొందరు పెద్దలు జగన్ కు నూరిపోసినట్లు సమాచారం. అటు అధినేత పట్టించుకోకపోవడం, జిల్లాలో పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా పనిచేయడం వంటి కారణాలతో వేమిరెడ్డి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది మున్ముందు బలపడితే మాత్రం వేమిరెడ్డి పార్టీని వేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే వైసిపి తో పాటు జగన్ కు సైతం వ్యక్తిగతంగా లోటే.