Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి వైసీపీ అధిష్టానం పొమ్మన లేక పొగబెడుతుందా? గన్నవరం రేసు నుంచి సైడ్ కావాలని అగ్రనేతలు సూచిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కేట్ దక్కడం కష్టమేనా? దాదాపు ఆయన ఒంటరి అయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. టీడీపీని విభేదించి వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే వంశీ రాకను గన్నవరం నియోజకవర్గంలో మెజార్టీ వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు. ముఖ్యంగా దుట్టా రామచంద్రరావు వర్గీయులు వంశీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ వైసీపీ కేడర్ తో ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

అక్రమంగా కేసులు బనాయించారు. అధిష్టానం అవసరాలకు వంశీని పార్టీలోకి తీసుకున్నా… లోకల్ కేడర్ కు మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అందుకే వంశీకి తప్పించి ఎవరికి టిక్కెట్ కేటాయించినా గెలిపించుకుంటామని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం ద్రుష్టికి తీసుకొచ్చారు. పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం చేశారు. ఇటీవల గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ కుటుంబసభ్యులే చేసుకుంటామని బయట వారు అవసరం లేదని కూడా తేల్చిచెప్పారు. దీంతో పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నారు.
Also Read: Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో జగన్ సర్కారు సహాయ నిరాకరణ.. చేతులెత్తేసిన సీబీఐ
అయితే గన్నవరం పంచాయితీని తేల్చే బాధ్యతను అధిష్టానం సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించింది. అయితే సజ్జల మాత్రం వల్లభనేని వంశీ సైడ్ కావాల్సిందేనన్న సంకేతాలిచ్చారు. రెండు వర్గాలను తాడేపల్లి పిలిపించిన సజ్జల దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. వంశీపై వారి వద్ద నుంచి అన్ని రకాల కంప్లైంట్లు తీసుకున్నారు. శివభరత్ రెడ్డి జగన్ భార్య భారతి తరపు బంధువు కూడా కావడంతో ఆ మర్యాదలు ప్రత్యేకంగా లభించాయి. వంశీతో కలిసి పని చేసే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పినట్లుగా వైసీపీ వర్గాలు మీడియాకు చెప్పాయి. దానికి సజ్జల కూడా ఏమీ అనలేదని… వంశీ వివరణ తీసుకుని మళ్లీ పిలుస్తామని చెప్పి పంపించేశారు.
వంశీకి అవమానం..
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో వంశీకి తీరని అవమానం జరిగింది. దుట్టా రామచంద్రరావు, శివభరత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు వంశీని బయటే కూర్చోబెట్టిన సజ్జల… దుట్టా వర్గీయులు వెళ్లిపోయిన తర్వాత వంశీని లోపలికి పిలిచారు. కానీ నాలుగైదు నిమిషాలు కూడా మాట్లాడక ముందే తాను హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఉందని.. తర్వాత మాట్లాడదామని చెప్పి పంపేశారు. దీంతో వల్లభనేని వంశీకి తీవ్ర అవమానం జరిగినట్లయింది. ఎమ్మెల్యేని అయిన తన వాదనను మొదట వినకుండా… ప్రత్యర్థుల మాటలను వినడమే కాకుండా.. తన వివరణను పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వంశీ ఫీల్ అయ్యారు. అయితే.. సజ్జల కావాలనే చేశారని.. గన్నవరంలో దుట్టాకే ప్రాధాన్యం అని.. చేతలతో చెప్పారని వైసీపీ వర్గాలంటున్నాయి.

ఈ మొత్తం పరిణామాలతో గన్నవరం వైసీపీలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. వంశీకి ఆయన అనుచరులు తప్ప ఎవరూ లేరు. వైసీపీ నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా లేరు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చాలా ఇబ్బందులు పెట్టారని.. ఇప్పుడు కూడా వైసీపీలో చేరి .. తమకు చాన్స్ లేకుండా దోచుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో వంశీకి గన్నవరంలో గడ్డు పరిస్థితి ఎదురయినట్లుగా తెలుస్తోంది. తన కంటే మంచి అభ్యర్థి అని భావిస్తే వారికే టిక్కెట్ ఇవ్వమని వంశీ చెబుతున్నారని.. వైసీపీ కూడా అదే అంటోందన్న విషయం వంశీకి ఇంకా అర్థం కాలేదన్న వాదన వినిపిస్తోంది. పరిస్థితి చూస్తే వంశీకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌటేనని క్లారిటీకి వస్తున్నారు.
టీడీపీలో చాన్ష్ లేనట్టే..
అయితే వంశీ పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. అటు అధికార వైసీపీకి దగ్గర కాకుండా.. టీడీపీకి దూరమయ్యారు. టీడీపీ అధినేత కుటుంబంపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరింత దూరం పెంచుకున్నారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వ సాధారణమే అయినా.. వంశీ మాత్రం పరిధి దాటి వ్యవహరించారన్న వ్యాఖ్యలు అనుచరుల నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీలో ఉంటే ఎంతో గౌరవంగా ఉండేదని..దానిని వదులుకొని చేజేతులా కష్టాలు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నామని తెగ బాధపడుతున్నారు. అలాగని సొంత గూటికి వెళతామంటే దారులు మూసుకుపోయాయి. వైసీపీలో పరిస్థితి చూస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. దీంతో వల్లభనేని వంశీకి ఎటూ పాలుపోవడం లేదు.
Also Read:Jagananna Amma Vodi: ఈ సారి ‘అమ్మ ఒడి’ నుంచి రూ.2 వేలు కట్.. తల్లులకు జగన్ షర్కారు షాక్