NTR Health University Row: హెల్త్ యూనివర్సిటీ వివాదం ఇప్పట్లో చల్లబడేటట్టు కనిపించడం లేదు. దీంతో కొత్త కొత్త ఇష్యూలు బయటకు వస్తున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీతో పాటు అన్ని రాజకీయ పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. అప్పటి నుంచి జరుగుతున్న రగడకు ఫుల్ స్టాప్ పడడం లేదు. అటు విపక్షాలైన బీజేపీ, జనసేన నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. టాలివుడ్ లో కొందరు స్పందించారు. అయితే దీనికి దీటుగా వైసీపీ సీనియర్లు, మంత్రులు స్పందిస్తున్నారు. ఆర్ కే రోజా, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, అంజాద్ భాషా, మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని తదితరులు గట్టిగానే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. చంద్రబాబుపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
అయితే ఇరు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండగా విజయవాడలోని ప్రధాన జంక్షన్లలో పోస్టర్లు వెలిశాయి. నాడు ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడ్ని చేసే సమయంలో చంద్రబాబు డెక్కాన్ క్రానికల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను ఇప్పుడు హైలెట్ చేశారు. ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్’ అంటూ నాడు డీసీ చంద్రబాబు ఇంటర్వ్యూను ప్రచురించింది. శీర్షికనే హైలెట్ చేస్తూ వేసిన పోస్టర్లు విజయవాడ వ్యాప్తంగా ప్రధాన జంక్షన్లలో అతికించారు. నగరంలోని జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వీటిని అతికించారు. రమేష్ హాస్పిటల్స్, బెంజ్ సర్కిల్, సిద్దార్థ్ కాలేజీ, సత్యానారాయణపురం, గన్నవరం, కృష్ణలంక, పడమట, అజిత్ సింగ్ నగర్, విద్యాధరపురం, గవర్నరుపేట తదితర కూడళ్లలో పోస్టర్లను ఏర్పాటుచేశారు.
హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును టీడీపీ తప్పుపడుతున్న నేపథ్యంలో పోస్టర్లు వెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే సరైన సమయం చూపి పోస్టర్లను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం దేవి శరన్నవరాత్రి వేడుకలు జరుగుతుండడంతో నగరానికి లక్షలాది మంది వస్తున్నారు. ప్రధాన జంక్షన్లలో పోస్టర్లు ఉండడంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. వుయ్ డోంటు నీడ్ ఎన్టీఆర్ అంటూ పోస్టర్లపై ఉండడాన్ని గమనిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని గుర్తుచేస్తూ ప్రత్యర్థులు ఏర్పాటుచేసిన పోస్టర్లు ఆలోచింపజేస్తున్నాయి. నాటి ఎపిసోడ్ ను గుర్తుకు తెచ్చేలా పోస్టర్లు ఏర్పాటుచేసి చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రత్యర్థలు వీటిని ఏర్పాటుచేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఇది ముమ్మాటికీ వైసీపీ నేతల పనేనని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై నిరసనలు పెల్లుబికాయి. అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నుంచి కూడా నిరసన వ్యక్తమైన సందర్భాలున్నాయి. అటు జగన్ సోదరి షర్మిళ కూడా ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కూడా అదే స్థాయిలో డ్యామేజ్ చేయడానికి దుశ్చర్యకు దిగారని టీడీపీ అనుమానిస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై కూడా అనుమానం ఉంది. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని టీడీపీ అభిమానులు జూనియర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.ఈ విషయంలో టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు పోస్టర్లు వెనుక జూనియర్ అభిమానుల పాత్ర ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మొత్తానికైతే ఏపీలో పోస్టర్ల దుమారం ఇప్పట్లో ఆగినట్టు కనిపంచడం లేదు.