
కరోనా.. కరోనా.. కరోనా ఈ పేరు చెబితేనే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుండటం ఆయా దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. అయితేనేం.. కరోనా భయం వారిని వీడటం లేదు. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. కరోనా అనే భయం పట్టుకుంటోంది. తామకు ఎక్కడ కరోనా అంటిస్తారేమోనని చుట్టుపక్కల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా కరోనా భయంతో ఓ యువకుడి తన స్నేహితుడిని కాల్చిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది.
యూపీలోని నోయిడా జార్చాలో కొందరు యువకులు కలిసి సరదాగా ల్యూడోగేమ్ ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి ఓ యువకుడు మధ్యలో దగ్గడంతో పక్కనే ఉన్న మరో యువకుడు తుపాకీతో అతడిని కాల్చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ సింగ్ అనే యువకుడిని స్నేహితులు వెంటనే ఆసుప్రతిలో చేర్పించారు. వైద్యులు ఆ యువకుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుల వద్దకు తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఒకప్పుడు తుమ్మినా.. దగ్గినా ప్రతీఒక్కరు లైట్ తీసుకునేవారు. కరోనా ఎంట్రీ ఇచ్చాక తుమ్మినా.. దగ్గినా ప్రాణాలు పోయే పరిస్థితులు రావడం శోచనీయంగా మారింది.