Child Trafficking: ఏపీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. పిల్లల అక్రమ రవాణాలో జాతీయస్థాయిలో మూడో స్థానం నిలిచింది. తొలి రెండు స్థానాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్ ఉండగా… మూడో స్థానాన్ని మాత్రం ఏపీ దక్కించుకుంది. అయితే యూపీ,బీహార్ జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్రాలు. వాటి సరసన ఏపీ నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
భారత్ చిన్నారుల అక్రమ రవాణా పేరుతో గేమ్స్ 24/7 అనే స్వచ్ఛంద సంస్థ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన కే ఎస్ సి ఎఫ్ సహకారంతో అధ్యయనం చేసిన నివేదికను ఇటీవల వెల్లడించారు. పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి కె ఎస్ సి ఎఫ్ తో పాటు దాని అనుబంధ సంస్థల వద్ద 2016 నుంచి 2022 వరకు ఉన్న సమాచారాన్ని గేమ్స్ 24 /7 సేకరించింది. పిల్లల అక్రమ రవాణాలో బీహార్ మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఆరేళ్లలో ఏకంగా 4245 మంది బాలలు అదృశ్యమయ్యారు. యూపీలో అదృశ్యమైన వారి సంఖ్య 3836 మంది. ఆ తరువాత స్థానంలో ఏపీ నిలిచింది.
ఏపీకి సంబంధించి ఆరేళ్ల వ్యవధిలో 734 మంది బాలల అక్రమ రవాణా జరిగినట్లు తెలుస్తోంది. గుంటూరులో 208 కేసులు, నెల్లూరులో 125, శ్రీకాకుళంలో 98, కర్నూలులో 74, భీమవరంలో 28 కేసులు నమోదయినట్టు తేలింది. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనపై వైసీపీ నేతలు ముప్పేట దాడి చేశారు. కానీ ఇటీవల రాజ్యసభలో మహిళల అదృశ్యంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పవన్ ఆరోపించిన మాదిరిగానే దాదాపు 28 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది. ఇప్పుడు ఏపీలో బాలల అదృశ్యంపై ఓ అత్యున్నత సంస్థ వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.