Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. బీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ కూడా జోరు పెంచుతోంది. ఇక ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ మాత్రం వెనుకబడే ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం ఆగమేఘాల మీద ఏర్పాటు చేసిన 14 కమిటీలు ఆశించినంత స్పీడ్‌గా పని చేయడం లేదు. పదిమంది సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలో పార్టీ వీడతారని వార్తలు రావడంతో అసంతృప్త నేతలే చైర్మన్‌గా అధిష్టాన కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ఇందులో రెండు మూడు మినహా మిగిలిన కమిటీలు ఇప్పటివరకు పని మొదలుపెట్టలేదు. అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన స్క్రీనింగ్ కమిటీ పని చేసినా చేయకున్నా రాష్ట్ర అధ్యక్షుడు, మరికొద్ది మంది సీనియర్ నేతలు దాదాపు 40 మంది పేర్లను షార్ట్ లిస్టు చేసి పార్టీ ఎలక్షన్ కమిటీకి పంపించారు. నేడో రేపో ఫస్ట్ లిస్టు రిలీజ్ కావచ్చని రాష్ట్ర నేతలు చెప్తున్న మాట.
ఆందోళనల కమిటీ సైలెంట్..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలు నిర్వహించే ఉద్దేశంతో స్టేట్ యూనిట్ విజయశాంతి నేతృత్వంలో ఎజిటేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనకు ఈ కమిటీ ప్లానింగ్ చేయలేదు. సిటీలో ప్రవళిక ఆత్మహత్య ఘటనపై బీజేపీ సహా విపక్షాలన్నీ ప్రకటనలు చేసినా ఈ కమిటీ మాత్రం రోడ్డెక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఎన్నికల సమయంలో యూత్, విద్యార్థులు, నిరుద్యోగులను ఆకట్టుకునే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసినా కార్యాచరణ మాత్రం మొదలే కాలేదు.
చార్జిషీట్ కమిటీ అంతంతే..
సర్కారు వైఫల్యం, పథకాల అమలు తీరు, ప్రజల సమస్యలు తదితరాలతో బీఆర్‌ఎస్‌ను ఎండగట్టాలని సీనియర్ నాయకుడు మురళీధర్‌రావు అధ్యక్షతన నలుగురితో కమిటీ ఏర్పాటైంది. అధికార పార్టీ వైఫల్యాలపై ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కమిటీని నెలకొల్పింది. సోషల్ మీడియా టాస్క్ కూడా అప్పగించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా కార్యాచరణ లేదు. స్టేట్ పార్టీ ఆఫీసు దగ్గర ఇంతకాలం కనిపించిన సాలు దొరా.. సెలవు దొరా.. డిజిటల్ డిస్‌ప్లే కూడా పనిచేయడం మానేసింది.
‘ఇన్‌ఫ్లూయెన్స్’ చేయని కమిటీ
సీనియర్ నాయకురాలు డీకే.అరుణ ఆధ్వర్యంలో ఇన్‌ఫ్లూయెన్స్ ఔట్ రీచ్ కమిటీని పార్టీ నెలకొల్పింది. పట్టణాల మొదలు గ్రామాల వరకు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడానికి ప్రభావం చూపగలిగే వ్యక్తుల ద్వారా కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలన్న ఈ కమిటీ లక్ష్యం గాడిన పడలేదు. సెలెబ్రిటీలు, క్రీడాకారులు తదితర వ్యక్తులను కలిసి పార్టీకి ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహించడం, క్యాంపెయిన్ చేయడం, వారి మెసేజ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఇలాంటివి చేయాల్సిన కమిటీ ఇప్పటికీ ప్రోగ్రామ్ చేపట్టలేదు. సికింద్రాబాద్ సిక్ విలేజ్లో సమావేశం జరగలేదు. నిర్వహించినా దానికి కొనసాగింపుగా ఏమీ జరగలేదు.
ఊపందుకున్న మేనిఫెస్టో కమిటీ..
మేనిఫెస్టో తయారీ కోసం మాజీ ఎంపీ వివేక్ అధ్యక్షతన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో ఏర్పడిన కమిటీ రెండు మూడు సిట్టింగ్లు వేసి కొన్న అంశాలను క్రోడీకరించింది. వివిధ సెక్షన్ల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. దసరా పండుగ నాటికి మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని భావిస్తుంది. విద్య, వైద్యం, చేతివృత్తులవారికి ఉచిత కరెంటు, ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్, తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల తాగునీటి సరఫరా అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలనుకుంటుంది. ఎస్సీ కాలనీలు, మురికివాడల్లోని ఇళ్లకు ఆస్తిపన్ను నుంచి పూర్తి మాఫీ కల్పించాలనే ప్రతిపాదన కూడా చేసినట్లు తెలుస్తోంది.