AP Govt Employees: వేతన జీవులు గుర్తించుకునేది ఒకటో తారీఖు. అదే తేదీన బ్యాంక్ ఖాతాల్లో జీతాలు జమ అవుతాయి. పాలవాడి నుంచి పేపరు బిల్లుల దాకా.. రేషన్ షాపు నుంచి పిల్లల ఫీజుల వరకూ అదే తేదీన చెల్లింపులు చేస్తారు. ఆర్థికపరమైన అన్ని అంశాలు అదే తేదీ చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే ఉద్యోగులు ‘అమ్మో ఒకటో తారీఖు’ అని సంబోధిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యం కలిగిన ఒకటో తారీఖు చరిత్రను జగన్ సర్కారు చెరిపేసింది. ఆ తేదీన చెల్లించాల్సిన జీతాలను నెలలో మూడో వారంలో చెల్లిస్తోంది. పింఛనుదారులకు చుక్కలు చూపిస్తోంది. శేష జీవితంలో ఉండే వారు పింఛను మొత్తం ఆసరా. మందుల నుంచి రోజువారి ఖర్చుల వరకూ అదే వారికి ఆధారం. వారికి కూడా నెలల మూడో వారం దాటితే కానీ చెల్లించలేని స్థితికి ఏపీ సర్కారు జారుకుంది.

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ నెలలో కూడా ఏపీ సర్కారు సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయింది. ‘సకాలంలో జీతాలు ఇప్పించండి మహా ప్రభో.. ఈ విషయంలో చట్టం చేయండి’ అంటూ ఉద్యోగులు గవర్నర్ కు విన్నవించే వరకూ పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. గత కొద్ది నెలలుగా ఓపిక పట్టామని.. ఇక కుదరదంటూ ధైర్యం పోగుచేసుకొని ఉద్యోగులు రాజ్ భవన్ కు వెళ్లి ఫిర్యాదుచేశారు. అయితే ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా మారిపోయాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు మాత్రం చట్టం చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించే మార్గదర్శకాలు ఉన్నాయని బయటపెడుతున్నారు.
ఏపీ చరిత్రను ఒకసారి గమనిస్తే ఉద్యోగులు పనిచేసిన నెలకు చివరి రోజు జీతాలు చెల్లించాలని స్పష్టమైన జీవో ఒకటుంది. 1977 నుంచే జీవో 176 అమలవుతోంది. ఆ జీవో ప్రాప్తికే ప్రతినెల చివరి రోజు జీతాలు, పింఛన్లు ట్రెజరీ ద్వారా చెల్లించేవారు. 1979లో జీవోలో సవరణ తెచ్చారు. 159 జీవో జారీచేశారు. అప్పటి నుంచి ఉద్యోగికి ఠంచనుగా ఒకటో తేదీన జీతాలు జమ అయ్యేవి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అప్పటి నుంచే ఆదరణ పెరిగింది. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎగబడేవారు. నెలలో చివరి రోజు జీతాల చెల్లింపు అనేది 1990 వరకూ కొనసాగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ జీతాలు చెల్లింపు తేదీని ఒక రోజుకు పొడిగించారు. ముందు నెల జీతం ..తరువాత ఒకటో తేదీకి మార్చారు. అయితే ఇది అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమైతే కాదు.

1988లో జిల్లా ఖజానా అధికారుల సదస్సు నిర్వహించారు. ప్రతినెలా అకౌంట్ల సమర్పణపై చర్చ జరిగింది. ముందు నెలకు సంబంధించి లావాదేవీలను.. ఆ మరసటి నెల 12 నుంచి 17 మధ్య తేదీల్లో ఖజానా అధికారులు అకౌంట్లను హైదరాబాద్ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ కు సమర్పించేవారు. అయితే ఉద్యోగులకు ప్రతి నెలా చివరి తేదీ జీతాలు చెల్లింపుల్లో ఆ రోజు లావాదేవీలు భారీగా జరిగేవి. దీంతో అకౌంట్ల సమర్పణలో ఆలస్యమైంది. అందుకే జీతాలు చెల్లింపు ఒక రోజు వాయిదా వేస్తే తమ అకౌంట్ల సమర్పణకు సులువుగా ఉంటుందని ఖజానా అధికారులు విన్నవించారు. దీంతో ప్రభుత్వం జీతాల చెల్లింపు తేదీని నెలలో చివరి తేదీ నుంచి.. ఆ మరుసటి నెల ఒకటో తేదీకి మార్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే తేదీన జీతాలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. జగన్ సర్కారు వచ్చిన తరువాత తేదీలు మూడో వారానికి దాటుతున్నాయి. అప్పుపుడితే కానీ ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేని దౌర్భగ్య పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. జీవితకాలం లేటు అన్నట్టు మారిపోయాయి.