అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

మహానగరం హైదరాబాద్ కు వచ్చే సెప్టెంబర్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇన్నాళ్లు ప్రజా రవాణా లేకుంటేనే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. అదే ప్రజా రవాణా మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. కేంద్రం తాజాగా అన్ లాక్ 4.0లో మెట్రో సర్వీసులు, సిటీ బస్సులకు అనుమతి ఇస్తుంది. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లో ప్రజలకే అవే నిత్యావసరం. మరి ఇంత మంది ప్రజా రవాణా ఉపయోగిస్తే కరోనా కల్లోలం ఖాయం. ఇప్పటికే […]

Written By: NARESH, Updated On : August 29, 2020 2:46 pm
Follow us on


మహానగరం హైదరాబాద్ కు వచ్చే సెప్టెంబర్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఇన్నాళ్లు ప్రజా రవాణా లేకుంటేనే కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. అదే ప్రజా రవాణా మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. కేంద్రం తాజాగా అన్ లాక్ 4.0లో మెట్రో సర్వీసులు, సిటీ బస్సులకు అనుమతి ఇస్తుంది. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లో ప్రజలకే అవే నిత్యావసరం. మరి ఇంత మంది ప్రజా రవాణా ఉపయోగిస్తే కరోనా కల్లోలం ఖాయం. ఇప్పటికే పెరుగుతున్న కేసులు భయపెడుతుంటే.. సెప్టెంబర్ 1 నుంచి తీవ్రత ఎలా ఉంటుందనే భయం అందరినీ వెంటాడుతోంది.

Also Read: రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న కొలదీ దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు విడతల వారీగా లాక్‌ డౌన్‌ అమలు చేశాయి. గత మూడు నెలలుగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తోంది. ప్రస్తుతం అన్‌లాక్‌ 3.0 నడుస్తుండగా మరో రెండు రోజుల్లో ఇది ముగియనుంది. తదుపరి దేశంలో అన్‌లాక్‌ 4.0 షురూ కానుంది. అయితే.. ఈ 4.0లో కేంద్రం మెట్రో రైళ్లు నడుపుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చింది. ఇక మెట్రో రైళ్లు షురూ కాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌ సిటీలో బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి రెడీ అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల్లో భయం మొదలైంది.

కొవిడ్‌ కేసులు రాష్ట్రంలో ఇప్పటికే లక్షా 20 వేలకు చేరువ కాగా.. ఇందులో మేజర్‌‌ కేసులు హైదరాబాద్‌ మహానగరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిటీ సర్వీసులు ప్రారంభిస్తే తమకు కొవిడ్‌ ప్రమాదం తప్పదని ప్రజలతోపాటు ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 600 మందికి పైగా ఆర్టీసీ సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 40 మంది వరకు చనిపోయారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. నగరంలో సిటీ బస్సులు నడవకపోయినప్పుడే కేసుల సంఖ్య ఇలా ఉంటే.. ఇక సిటీ సర్వీసులు ప్రారంభమైతే సంఖ్య ఇంకా ఎలా ఉంటుందోనని కార్మిక సంఘాలూ ఆవేదన చెందుతున్నాయి. ప్రస్తుతం స్టాఫ్‌ అందరూ కూడా రొటేషన్‌ పద్ధతిలో డ్యూటీకి హాజరవుతున్నారు. ముందుముందు రెగ్యులర్‌‌గా రావాల్సి ఉంటుంది. దీనికితోడు జిల్లాల్లో లాగా ఇక్కడ విశాలమైన డిపోలు ఉండవు. ఇరుకిరుకుగా ఉంటాయి. నిలబడేందుకు కూడా ఖాళీ స్థలం ఉండదు. ప్రయాణికుల్లో కానీ.. స్టాఫ్‌లో కానీ ఎవరైనా వైరస్‌ బారిన పడి బస్సుల్లో ప్రయాణిస్తే మిగితా వారందరికీ అంటుకునే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం జిల్లాల్లో నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికులు పెద్దగా కనిపించడం లేదు. మెజార్టీ బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. కానీ.. హైదరాబాద్‌ మహానగరంలో సిటీ సర్వీసులు ప్రారంభమైతే అలాంటి పరిస్థితి ఉండదు. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిటకిటలాడాల్సిందే. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్‌ కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఇక ఈ బస్సులు కూడా ప్రారంభమైతే ట్రాఫిక్‌ మరింత పెరుగుతుంది. అటు మెట్రో ప్రయాణికులు.. ఇటు బస్సు ప్రయాణికులు ఎవరినీ ఆపలేం. ఈ నేపథ్యంలో కరోనాను ఎలా కట్టడి చేయగలమన్నా ప్రశ్న ఉదయిస్తోంది.

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

వీటన్నింటికి తోడు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లదే ‘కీ’ రోల్‌. వీరిలో 55 ఏళ్ల పైబడ్డ వారే రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది ఉన్నారు. 13 వేల మంది మహానగరంలోనే ఉన్నారు. ఇప్పటికైతే కరోనా బారిన పడి చనిపోతోంది 50+ ఏజ్‌ ఉన్న వారే. దీంతో వీరిలో టెన్షన్‌ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సిటీ సర్వీసులు ప్రారంభిస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి సెలవులు పెట్టడానికే నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల సంగతి చెప్పడానికి భయానకంగా ఉంది. కరోనా కేసులు పెరిగితే హైదరాబాద్ లో ఏం చేయాలన్న దానిపై సర్కారులోనూ చిత్తశుద్ధి లేదు. సో ఈ ఉత్పాతాన్ని ఎలా తట్టుకోగలమో చూడాలి మరీ..