కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జనం ఆశీర్వాదం కోసం జనయాత్ర చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్రకు రెడీ అవుతున్న వేళ అంతకంటే ముందే కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిష్టాత్మక జన ఆశీర్వాద యాత్రకు రెడీ అయ్యారు.
కేంద్రంలో బీజేపీ పాలన ఏడేళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ్టి నుంచి ఈ యాత్ర చేపట్టనున్నారు. దీనికి జన ఆశీర్వాద యాత్రగా నామకరణం చేశారు. ఏపీలో రెండు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. యాత్ర పొడువునా బీజేపీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను కిషన్ రెడ్డి ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తారు.
జన ఆశీర్వాద యాత్రకు ముందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుమలకు చేరుకుంటారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని కోదాడకు బయలుదేరుతారు.
కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర తిరుపతి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో తొలుత యాత్ర సాగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కోదాడ తిరుమలపూర్ గ్రామం చేరుకుంటారు. రాత్రి సూర్యపేటలో బస చేస్తారు.
20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్ధన్నపేట మీదుగా వరంగల్ లోకి ప్రవేశిస్తారు. అక్కడ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని వరంగల్, హన్మకొండలో తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. సర్వాయి పాపన్న గ్రామమైన ఖిలాషాపూర్, జనగామ, ఆలేరులో యాత్ర నిర్వహిస్తారు. యాదాద్రి చేరుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. యాదాద్రిలోనే రాత్రి బస చేస్తారు. భువనగిరి నుంచి ఘట్ కేసర్, ఉప్పల్ మీదుగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయం చేరుకొని అక్కడ భారీ సభలో ముగిస్తారు.
ఈ యాత్ర కోసం బీజేపీ నేతలు 40 చోట్ల సభలకు ఏర్పాట్లు చేశారు. కిషన్ రెడ్డి వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.