KCR vs Vittal: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ 2009 డిసెంబర్ 9న ప్రారంభమైంది. అప్పటి యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం చేత ప్రకటించారు. సెప్టెంబర్ 29న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అప్పటి అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టిన తరువాత జరిగిన పరిణమాల అనంతరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ దీక్ష చేయడానికి తానే కారణమని టీపీపీఎస్సీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత విఠల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అయితే కేసీఆర్ దీక్ష చేసే ముందు జరిగిన పరిణామాల గురించి ఆయన మీడియాతో వివరించారు.

తెలంగాణ ఉద్యమంలో విఠల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్షంగా ఉద్యమంలో ఉన్న ఆయన అప్పటి విషయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..‘‘2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొందింది. దీంతో మరోసారి టీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. అయితే రెండోసారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రోశయ్య సీఎం అయ్యారు. ఈ సందర్భంగా అప్పటికే తెలంగాణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కొందరు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, రాజకీయ నాయకులు హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించాలని సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ప్రకటిస్తుూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ఉద్యోగులంతా హైదరాబాద్ లో ర్యాలీ తీశాం’ అని నాటి పోరాటాన్ని విఠల్ గుర్తు చేసుకున్నారు.
Also Read: తెలంగాణలో కేసీఆర్ పప్పులు ఉడికేలా లేవే? బీజేపీ ఏం మాయ చేస్తోంది
‘ఈ సమయంలో కేసీఆర్ తన నివాసానికి ఉద్యోగులను పిలిపించుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కలిసికట్టుగా రావాలని కోరారు. దీంతో సిద్ధిపేటలో ఉద్యోగుల ఆధ్వర్యంలో గర్జన సభ నిర్వహించాం. వాస్తవానికి ఇది ఉద్యోగుల గర్జన సభ. కానీ ఈ సభకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇక్కడ ఉద్యోగుల ఐకమత్యాన్ని గ్రహించిన కేసీఆర్ ఈ సభా వేదికపై అమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత కరీంనగర్లో కేసీఆర్ దీక్ష.. ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే..’ అని విఠల్ వివరించారు.
‘అయితే సుప్రీం కోర్టు హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించిన విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఉద్యోగులమైన మేము ర్యాలీ తీయడంతో హైప్ క్రియేట్ అయిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా అప్పటి ప్లోర్ లీడర్ ఈటల రాజేందర్ సహాయంతో ఈ విషయంపై మీడియాలో కూడా చెప్పించాం. దీంతో ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. ఆ తరువాత సిద్దిపేట సభలో కేసీఆర్ 14 ఎఫ్ గురించి మాట్లాడారు. అలా డిసెంబర్ 9 దీక్షముందు ఉద్యోగులు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు’ అని విఠల్ చెప్పారు. ఉద్యోగుల వల్లే తెలంగాణ ఉద్యమం రగిలిందని వివరించారు.
Also Read: నిరుద్యోగులతో తెలంగాణ చెలగాటం.. నోటిఫికేషన్ విడుదలలో తాత్సారం