Union Budget 2024: పేదలు, మధ్య తరగతి ప్రజల, వేతన జీవుల ఆకాంక్షలు నెరవేర్చడం.. వికసిత్ భారత లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వ్యవసాయరంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలికరంగం, పరిశోధన–ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ప్రారంభోపన్యాసంలో చెప్పినట్లుగానే ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పనకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. గతం కంటే ఈసారి బడ్జెట్ కేటాయింపులు పెంచారు. 2023–24 ఆర్థిక సర్వే ప్రకారం.. పెరుగుతున్న శ్రామిక శక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రగంలో 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంది. ఈనేపథ్యంలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.
ఆర్థిక సర్వే ఇలా…
ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య(సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనా వేసింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని భావించింది. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారని పేర్కొంది. ఆర్థిక వద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది. శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని సూచించింది. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది. వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్‌ను, ప్రస్తుతం ఉన్న పీఎల్‌ఐ(5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్సై్టల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది.
56.5 కోట్ల శ్రామిక శక్తి..
భారతదేశం ప్రస్తుతం 56.5 కోట్ల శ్రామికశక్తి కలిగి ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇందులో దాదాపు 45 శాతం మంది వ్యవసాయంలో, 11.4 శాతం మంది తయారీలో, 28.9 శాతం మంది సేవలలో, 13 శాతం మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్) గణాంకాలు చెబుతున్నాయి. నిర్మాణాత్మక పరివర్తన కారణంగా, శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా క్రమంగా 2023లో 45.8 శాతం నుంచి 2047 నాటికి తగ్గుతుందని సర్వే అంచనా వేసింది. వ్యవసాయాన్ని విడిచిపెట్టిన సంబంధిత శ్రామికశక్తి ఇతర రంగాల్లో శ్రామికశక్తి పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిపింది. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని అది పేర్కొంది.
ఉపాధితోపాటు సామాజిక భద్రత..
ఉపాధి అవకాశాల సంఖ్యతోపాటు నాణ్యత మరియు సామాజిక భద్రత కూడా కీలకమైన అంశాలు అని సర్వే పేర్కొంది. గిగ్ వర్క్‌ఫోర్స్ 23.5 మిలియన్లకు విస్తరిస్తుందని, వ్యవసాయేతర 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. శ్రామిక శక్తి లేదా 2029–30 నాటికి భారతదేశంలో మొత్తం జీవనోపాధిలో 4.1 శాతం. గ్రామీణాభివృద్ధికి ఆగ్రో ప్రాసెసింగ్ రంగం ఆశాజనకమైన రంగం అని సర్వే ఎత్తిచూపింది. భారతదేశం వంటి యువ దేశానికి సంరక్షణ ఆర్థిక వ్యవస్థ కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని, ఇది లింగ మరియు జనాభా డివిడెండ్‌లను పొందగలదని కూడా నొక్కి చెప్పింది.