Undavalli Arun Kumar: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఓటు పరంగా బిజెపి ప్రభావం లేకపోయినప్పటికీ.. రాష్ట్రంలో ఎవరెవరు ఎలా పోటీ చేయాలన్న దానిపై బిజెపి పాత్ర ఉండే అవకాశం ఉందంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వచ్చే ఎన్నికల నాటికీ రాజకీయ సరళి, అధికారంలోకి ఎవరు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్పినా కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన చెప్పే మాటలను రాష్ట్రంలో వినే వారి సంఖ్య, ఆసక్తికరంగా తెలుసుకునే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి, పాలన గురించి ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన అనేక కీలక అంశాలు పైన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రాష్ట్రంలో మోదీ డిసైడ్ చేస్తారు..
రాష్ట్రంలో రాజకీయ కూటములను నిర్ణయించేది నరేంద్ర మోడీ అని, ఆయన ఇచ్చే గ్రీన్ సిగ్నల్ ను బట్టి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఉంటాయని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని ఆయన భావిస్తే.. టిడిపి, జనసేన కూటమిగా వెళ్లకుండా చేసేందుకు అవకాశం ఉందని, లేదు చంద్రబాబు కావాలనుకుంటే టిడిపి – జనసేన – బిజెపి కూటమిగా వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని ఉండవల్లి స్పష్టం చేశారు. తమ కూటమిలో భాగస్వామిగా బిజెపి ఉండాలని భావిస్తున్న టిడిపి- జనసేన బిజెపి అగ్ర నాయకుల గ్రీన్ సిగ్నల్ కోసం కూడా వేచి చూస్తున్నాయి అన్న భావనను ఆయన వ్యక్తం చేశారు.
ఎవరు లెక్కల వారివే..
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తామని అన్ని పార్టీలు భావిస్తున్నాయని, ఎవరు లెక్కల వాళ్ళు వేసుకుంటున్నారని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఒంటరిగా వెళితే టిడిపికి 100 సీట్లు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ సీట్ల సంఖ్య మరో 30 నుంచి 50 కి పెరుగుతాయని చెబుతున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే ఏకంగా 175 175 గెలుస్తామని చెబుతున్నారు. ఎవరు లెక్కల్లో వాళ్ళు ఉన్నారు’ అని అరుణ కుమార్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 51 శాతం ఓటింగ్ తో విజయం సాధించిన వైసీపీ ఇప్పటికీ బలంగానే ఉందని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
పెరిగిన ప్రతిపక్షాల ఓటు బ్యాంకు..
2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన జనసేన, టిడిపి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో జనసేన ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని, గత ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకుతో పోలిస్తే అది డబల్ అయిందన్న బావను ఆయన వ్యక్తం చేశారు. టిడిపి ఓటు బ్యాంకు కూడా జరిగిందని ఆయన విశ్లేషించారు.
గ్రామీణ ఓటు బ్యాంకు కీలకం..
రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోను 65 నుంచి 70 శాతం ఓటింగ్ జరుగుతుంది. అయితే 40 శాతం మీద ఓటింగ్ గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతుంది. రెక్కాడితే గాని డొక్కాడనీ కుటుంబాలే ఈ 40 శాతం ఉంటాయని, వీరంతా తప్పనిసరిగా ఓటింగ్కు హాజరవుతారని ఉండవల్లి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి బలంగా ఉందని, అర్బన్ లో టిడిపి ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు.
ఓటర్లను మార్చగలిగే స్థాయిలో మీడియా ప్రభావం..
రాష్ట్రంలోని ఓటర్లు అందరిని ప్రభావితం చేసే స్థాయిలో మీడియా లేదని, అయితే పది నుంచి 15 శాతం ఓటు బ్యాంకు ను రాష్ట్రంలోని మీడియా మార్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇరు పార్టీలకు మీడియా ఉన్న నేపథ్యంలో.. ఏ మీడియా చెప్పిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఓటర్లు మారుతారు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మీడియా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నప్పటికీ.. పార్టీల వారీగా మీడియా విడిపోయిన నేపథ్యంలో ఓట్లు వేసే ప్రజలు కూడా ఆయా మీడియా చెప్పిన దానికి అనుగుణంగా మారిపోయే అవకాశం ఉందని భావనను ఆయన వ్యక్తం చేశారు.