KCR Politics : తొమ్మిదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ మంత్రం జపిస్తున్నారు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును అవే పథకాలు రెండుసార్లు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశాయి. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో గెలవడం ద్వారా దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో గెలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల్లో బీఆర్‌ఎస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు, ప్రతిపక్షాలను ఎన్నికల్లో చిత్తు చేసేందుకు సరికొత్త సంక్షేమ వ్యూహం రచిస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో రెండు కొత్త పథకాలు తెలంగాణలో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఉద్యమ సారథిగా 2014లో విజయం..
తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది తామే అని ఆ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ తెలంగాణ తెచ్చింది తానేనని కేసీఆర్, టీఆర్‌ఎస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే రూ.1000 పింఛన్లు, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ఇచ్చారు. ఉద్యమసారథిని గెలిపిస్తే హామీలు కూడా నెరవేరుస్తారని తెలంగాణ సమాజం నమ్మింది. దీంతో టీఆర్‌ఎస్ 67 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చింది.
2018లో గట్టెక్కించిన రైతుబంధు..
ఇక ఐదేళ్ల పాలన పూర్తి చేయకుండానే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలకు ముందే.. రైతుబంధు పథకం ప్రారంభించారు. భూమి ఉన్న ప్రతీ రైతుకు పెట్టుబడిసాయంగా రూ.4000 అందించారు. అయితే విపక్షాలు ఇది ఎన్నికల స్టంట్ అని ప్రచారం చేసింది. ఇక ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే తాను ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రచారం చేశారు. రైతు బీమా కూడా ఇస్తామని ప్రకటించారు. పింఛన్లు రూ2 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల బెడ్రూం ఇవ్వని వారికి సొంత జాగా ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదు సమయంలో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడంతో ఆంధ్రుల పాలన మనకు మళ్లీ అవసరమా అన్న ప్రచారం విస్తృతం చేశారు. దీంతో ఆంధ్రులు వస్తే మళ్లీ తెలంగాణ ఆగమైతుందని నమ్మి, కేసీఆర్ ఈసారైనా మాట నిలుపుకుంటాడని భావించి ప్రజలు మరోమారు అధికారం కట్టబెట్టారు. ఈ సారి 83 సీట్లు గెలిపించారు.
ఈసారి మరో రెండు ప్లాన్లు..
ఇక ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కేసీఆర్. అయితే ఇప్పటికే తొమ్మిదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎన్నికల ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, గత ఎన్నికల్లో ఇచ్చిన రూ.5 లక్షల ఆర్థికసాయం చేయకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయకపోవడం, దళితులకు మూడెకరాలు ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ పాలన, అవినీతి, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కాం ఇవన్నీ బీఆర్‌ఎస్‌పై వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు, చోటా మోటా నాయకులు కూడా కబ్జాలు, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారు. వీరికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మద్దుతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అన్న అంచనాలు ఉన్నాయి. అయితే అపర చాణక్యుడు అయిన కేసీఆర్ వీటన్నింటి మర్చిపోయేలా, ప్రతిపక్షాలను దెబ్బకొట్టేలా రెండు కొత్త పథకాలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో ఒకటి రైతుబంధు సాయం పెంపు. ప్రస్తుతం రూ.5 వేలు ఇస్తున్న రైతుబంధు సాయాన్ని వచ్చే వానాకాలం నుంచి ఎకరాకు రూ7 వేలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే ఏటా రెండ పంటలకు రూ.14 వేలు అందిస్తారు. ఇక రెండో పథకం రైతు పెన్షన్. ఈ పథకానికి ఇప్పటికే కేంద్రం కూడా కసరత్తు చేస్తోంది. అయితే కేంద్రం కంటే ముందే దీనిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 60 ఏళ్లు నిండిన రైతులకు రైతుబీమా అందడంలేదు. దీంతో వీరికి పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అర్హతలు ఎలా ఉండాలనే కసరత్తు కూడా ప్రభుత్వం చేస్తోంది.
మొత్తంగా బీఆర్‌ఎస్ అధినేత చేస్తున్న ఈ సకికొత్త సంక్షేమం ఆ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడుతుందా.. లేక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రతిపక్షంలో కూర్చోబెడుతుందో చూడాలి.