లాక్ డౌన్ సడలింపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వారిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన వారిలో మధిర మండలం మహదేవపురానికి చెందిన ఓ వ్యక్తికి, పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ సోకడం కలకలం రేపుతోంది. అదే బస్సులో వచ్చిన వీఎం బంజరకు చెందిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెప్పారు.
లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడుగురు, హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి మహారాష్ట్ర నుంచి ఓ బస్సును అద్దెకు మాట్లాడుకున్నారు. హైదరాబాద్, మహబూబాబాద్ వ్యక్తులు తమ ప్రాంతాల్లో దిగగా.. మిగిలిన ఏడుగురు ఖమ్మం చేరుకున్నారు. అయితే ఆ ఏడుగురిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ రాగా.. ఆమెతో పాటు క్వారంటైన్‌లో ఉంచిన మిగిలిన ఆరుగురిని కూడా ఈనెల 23న ఖమ్మంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 40 ఏళ్ల వయసున్న మరో వ్యక్తికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని నేరుగా 108ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా నుంచి ఉపాధి కోసం మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు వెళ్లి స్వగ్రామాలకు చేరుకున్న 260 మందిని అధికారులు క్వారంటైన్లలో ఉంచారు.