
YS Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరిగి దాదాపుగా కొలిక్కి వస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సిబిఐ అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే, అవినాష్ రెడ్డి బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుకు వెళ్లడంతో.. మంగళవారం విచారించిన హైకోర్టు అవినాష్ రెడ్డికి తాత్కాలిక ఊరట కల్పించేలా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు మంగళవారం సాయంత్రం కీలక ఆదేశాలను జారీ చేసింది.
సిబిఐ విచారణ పేరుతో తనను వేధిస్తోందని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి కు కొంత ఊరట కలిగించేలా తీర్పు ఇచ్చింది. సోమవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం కూడా సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆయన విజ్ఞప్తిని మన్నించింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా తెలంగాణ హైకోర్టు విధించింది. వీటిని అమలు చేస్తూ ముందస్తు బెయిల్ తీసుకోవాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.
విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలి..
బెయిల్ మంజూరు చేస్తూనే.. వివేక హత్య కేసు దర్యాప్తులో భాగంగా ప్రతిరోజు సిబిఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ఈనెల 25 వరకు ఆయన అరెస్టు చేయకుండా సిబిఐని ఆదేశించింది. ఈ నెల 25న ఈ కేసులో తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరించాలని షరతు కూడా విధించడంతో.. అవినాష్ రెడ్డికి పూర్తిగా సంతోషం దక్కకుండా పోయింది. అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా.. వీడియో.. ఆడియో రికార్డ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
రెగ్యులర్ విచారణకు సిబిఐ విన్నపం.. అంగీకరించిన కోర్టు..
అవినాష్ కు ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ సాగుతున్న నేపథ్యంలో సిబిఐ తరఫున విచారణ అధికారి కోర్టుకు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం అవినాష్ రెడ్డిని విచారణ చేయాల్సి ఉన్నా రేపు ఉదయం 10:30 గంటలకి వాయిదా వేస్తున్నట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. ముందస్తు బెయిల్ ఇచ్చినందున రేపటి నుంచి రెగ్యులర్ గా విచారణకు హాజరయ్యేలా చూడాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు మన్నించింది. ఈ మేరకు పిటిషనర్ అవినాష్ కు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ విచారణకు వెళ్లాలని, విచారణ అధికారులకు సహకరించాలని బెయిల్ మంజూరు చేస్తూనే తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి స్పష్టం చేసింది.
సిబిఐ చేతుల్లో కీలక ఆధారాలు.. అవినాష్ అరెస్ట్ ఖాయం..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న సిబిఐ అధికారులు.. కేసులో కీలక దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. కేసులో కీలకమైన వ్యక్తిగా అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. దాదాపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సిబిఐ అధికారులు సంపాదించారు. దీంతో రెండు రోజులు అటు ఇటు అయినా అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కి వస్తుండడంతో.. రాజకీయపరమైన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని పలువురు భావిస్తున్నారు. ఒకరకంగా చూసుకుంటే ఈ కేసు వ్యవహారం అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం వైసీపీకి కొంత ఇబ్బందికరమైన అంశంగానే నిపుణులు విశ్లేషిస్తున్నారు.