TVK Vijay: ఇటీవల కరూర్ ప్రాంతంలో టీ వీ కే పార్టీ అధినేత విజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు అనుకున్న దానికంటే ఎక్కువగా కార్యకర్తలు వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరగడంతో.. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటిదాకా తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా ఉన్న విజయ్ పై విమర్శలు మొదలయ్యాయి.
విజయ్ కార్నర్ మీటింగ్లో మరణించిన వారికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి కూడా పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనిపై ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు హైకోర్టు కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలో నాయకుడి లక్షణాలు కనిపించడం లేదంటూ మండిపడింది. అంతేకాదు కరూర్ ఘటనలో ముందస్తుగా బెయిల్ సాధించిన టీవీకే నేతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బెయిళ్ళు రద్దు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ టీవీకే పార్టీ సెక్రెటరీ బుసి ఆనంద్, జనరల్ సెక్రెటరీ సిటిఆర్ నిర్మల్ కుమార్ ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కరూర్ ఘటన జరిగిన తర్వాత తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ తీరును అటు టీవీకే పార్టీతో పాటు బిజెపి కూడా విమర్శిస్తోంది. కావాలని ఈ ఘటనకు పాల్పడ్డారని.. దీని వెనుక ఏదో ఉందనిపిస్తోందని నేతలు అంటున్నారు. అమాయకులను ప్రాణాలు పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై అధికార డిఎంకె పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
మరోవైపు ఇటీవల విజయ్ ఒక సెల్ఫీ వీడియో ద్వారా జరిగిన విషయాన్ని బయటపెట్టారు. తాము ప్రజల భద్రత కోసమే ఆలోచిస్తామని.. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ అభిమతం కాదని పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని.. అయితే దీని వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇలాంటి కుయుక్తులకు పాల్పడ్డారని విజయ్ ఆరోపించారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని.. దానికోసమే తాము ఎదురుచూస్తున్నామని విజయ్ వ్యాఖ్యానించారు.