TVK Maanadu Vijay: మనదేశంలో అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. పంచుడు పథకాలకు ఆజ్యం పోసింది తమిళనాడు నాయకులే. తమ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు టీవీలు, గ్రైండర్లు ఇచ్చిన ఘనత తమిళ నాయకులకే దక్కుతుంది. ఆ తర్వాతే ఆ దరిద్రం మిగతా రాష్ట్రాలకు పాకింది.. వాస్తవానికి తమిళ రాజకీయ నాయకులకు భారీతనం అంటే చాలా ఇష్టం. వారు ఏం చేసినా సరే గొప్పగా ఉండాలని భావిస్తుంటారు. ఆ గొప్పల వల్లే తిప్పలు పడుతుంటారు. ఈ జాబితాలో ఇప్పుడు హీరో విజయ్ కూడా ఉన్నాడు. ఇటీవల టీవీకే పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన అతడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు.
Also Read: పెళ్లై, కూతురున్నా ప్రియుడితో వెళ్లింది.. చివరకు ఇలా అయ్యింది
అంత భారీతనం ఎందుకు
తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయ్. అతని ఫ్లాప్ సినిమాలు కూడా వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు మానాడు పేరుతో అత్యంత భారీగా తన రాజకీయ సభలను నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా తన ప్రసంగాల ద్వారా సంచలనం సృష్టిస్తున్నాడు. ఇటీవల మధురై లో నిర్వహించిన మానాడులో విజయ్ చేసిన ప్రసంగాన్ని సామాజిక మాధ్యమాలలో 100 మిలియన్లకు పైగా రియల్ టైం వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడితే ఈ స్థాయిలో వీక్షణలు సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి అని సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనిని తమ నైతిక విజయం గా టీవీకే నేతలు చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో విజయ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
మానాడు కాదు పేదల వద్దకు వెళ్లాలి
మానాడు పేరుతో విజయ్ నిర్వహిస్తున్న రాజకీయ సభలు అత్యంత భారీగా ఉంటున్నాయి.. పేరు రాయడానికి ఇష్టపడని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటీవల మధురై బహిరంగ సభకు టీ వీ కే దాదాపు కోట్ల రూపాయల లో ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఖర్చుతో తమిళనాడు రాష్ట్రంలో ఏడాది పాటు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను కొనసాగించవచ్చని ఆ సంస్థ చెబుతోంది. పేదలకు న్యాయం చేస్తానని.. సంక్షేమ పథకాలు అందిస్తానని.. తమిళనాడు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తానని చెబుతున్న విజయ్.. అత్యంత భారీగా సమావేశాలు నిర్వహించకుండా.. ఆ సభలకు వెచ్చించే డబ్బుతో పేదలకు సదుపాయాలు కల్పిస్తే తమిళ రాజకీయాలు ఆయనకు మరింత అర్థమవుతాయని ఆ సంస్థ చెబుతోంది.
విజయ్ ఆలోచించుకోవాలి
ఇప్పటికైనా విజయ్ తన భారీతనాన్ని తగ్గించుకొని.. పేదల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటే తమిళ రాజకీయాలలో సరికొత్త నాయకుడిగా అవతరిస్తారని ఆ సంస్థ వెల్లడిస్తోంది.. మరి దీనిపై విజయ్ ఏమంటారో తెలియాల్సి ఉంది. వాస్తవానికి గతంలో ఓ రాగి కర్మాగారం వల్ల తీవ్ర నష్టాలపాలైన రైతుల కుటుంబాలను విజయ్ ఆదుకున్నారు. అర్ధరాత్రి పూట వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం చేశారు.. అప్పట్లో విజయ్ వారి ఇంటికి వెళ్లిన దృశ్యాలు మీడియాలో సంచలనం సృష్టించాయి. అప్పట్లోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. అది జరిగిన కొద్ది సంవత్సరాలకే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం విశేషం.