TV Channels- Telangana politics: తెలంగాణలో ఇటీవల కొన్ని రాజకీయ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై కొన్ని టీవీ చానళ్లు హైప్ తీసుకొస్తూ హైలైట్ చేస్తున్నాయి. రేటింగ్స్ కోసం కొన్ని చానెళ్లు ఒకడుగు ముందుకు వేసి తెలంగాణ మరో బెంగాళ్‌లా మారబోతుందా… అని చర్చలు, డిబేట్‌లు నిర్వహిస్తున్నాయి. కథనాలు కూడా ప్రసారం చేస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. సామాజిక మాధ్యమాలు తప్పుడు కథనాలు ఇస్తాయని, వ్యూస్, లైక్స్ కోసం వీడియోలు, పోస్టులు పెడతాయని చెప్పే న్యూస్ చానెళ్లే.. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ చిన్న ఘటనలను కూడా పెద్దగా చేసి చూపుతున్నాయి. తెలంగాణను బెంగాళ్‌తో పోల్చడమే ఇందుకు నిరదర్శనం.

ప్రతీ రాష్ట్రంలో రాజకీయ ఘర్షణలు..
పొలిటికల్ పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉండడం సహజం. ఏ రాష్ట్రంలో అయినా రాజకీయ ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఇవి జరుగకపోవడమే మంచిది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి సాధారణమయ్యాయి. తెలంగాణలోనూ అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ నాయకులు దూకుడు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేపట్టిన యాత్రను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఘర్షణలు జరుగుతున్నాయి.
బీజేపీ జాతీయ సమావేశాల సమయంలోనే..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అవకాశం లేకుండా నగరంలోని హోర్గింగులన్నీ ముందే బుక్‌చేసుకుని తెలంగాణ పథకాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని అదే సమయంలో హైదరాబాద్‌కు రప్పించి భారీ ర్యాలీ నిర్వహించింది. ఇదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. దీంతో ఘర్షలణలు జరుగుతున్నాయి. అయితే మీడియా ఈ చెదురుముదురు ఘటనలను హైలైట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ప్రధానంగా నాలుగు ఘటనలు..
తెలంగాణలో ఇటీవల నాలుగు ప్రధాన ఘటనలు జరిగాయి. ఒకటి ఖమ్మంలో బీజేవైఎం నాయకుడి ఆత్మహత్య. ఇందుకు మంత్రి పువ్వాడ అజయ్ కారణమని బాధితుడు ఆరోపించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక రెండోది బండి సంజయ్ పాదయాత్రను సందర్భంగా ఇటీవల టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ. మూడోది ఖమ్మం జిల్లా తెల్లారుపల్లిలో టీఆర్‌ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్య. దీనికి సీపీఎం బాధ్యులని కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్ మాత్రం అధికారికంగా దీనిపై ఇప్పటికీ స్పందించలేదు. రాజకీయ హత్యగా భావించడం లేదు. ఇక నాలుగోది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం. సొంతపార్టీ నాయకుడే హత్యాయత్నం చేయడం. ఈ నాలుగు ప్రధాన ఘటనలను సాకుగా చూపి కొన్ని మీడియా సంస్థలు విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీనిపై రాజకీయ నేతలతోపాటు అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కథనాలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.