
కన్న తండ్రే, తన కొడుకు మొహం మీద దిండు పెట్టి, ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన టర్కీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. టర్కీ ఫుట్ బాలర్ కెవెర్ టోక్టాస్ గత నెల 23న తన కొడుకు ఖాసిం (5)ను కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స జరుగుతుండగానే ఈనెల 4న ఫుట్ బాలర్..ఆ చిన్నారిని దిండుతో ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఏమీ ఎరుగనట్టుగా డాక్టర్లను పిలవడంతో వారు ఐసీయూకు తరలించి రెండు గంటలపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఆ చిన్నారికి కరోనా నెగెటివ్ వచ్చినా కూడా అతడి మృతిపై అప్పట్లో ఎవరికీ సందేహం రాలేదు. కానీ, పది రోజుల తర్వాత తీవ్ర పశ్చాత్తాపంతో టోక్టాస్ పోలీసులకు లొంగిపోయి అసలు విషయాన్ని తెలిపాడు. ‘15 నిమిషాల పాటు దిండుతో చిన్నారి మొహంపై గట్టిగా అదిమా. కొద్దిసేపయ్యాక తీసేయడంతో కదలికలు ఆగిపోయాయి. వెంటనే డాక్టర్లను పిలవడంతో ఎవరికీ సందేహం రాలేదు. వాడంటే నాకు మొదటి నుంచీ ఇష్టం లేదు. అందుకే చంపాను. మానసికంగా నేను ఆరోగ్యంగానే ఉన్నా’ అని టోక్టాస్ వివరించాడు. ఈ విషయం తెలిసిన యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.