
TTD Board: అయ్యిందా.. అనుకున్నట్టే అయ్యిందా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విషయంలో అలిగేషన్స్ ఉన్న వారందరికీ ‘ప్రత్యేక ఆహ్వానితులు’గా మార్చి టీటీడీ పదవులు కట్టబెట్టింది. ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 80 మందికి పైచిలుకు ఉన్న ఈ జంబో బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే అసమ్మతి వాదులు ఊరుకుంటారా? కోర్టుకు ఎక్కారు. ఇప్పుడక్కడ ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ జంబో బోర్డుకు హైకోర్టు చెక్ పెట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ఆహ్వానితులను నియమించింది. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సామాన్యులకు దర్శనం లేకుండా చేస్తున్నారని.. ఇంతమందికి వీఐపీ ట్రీట్ మెంట్ అవసరమా? అన్న విమర్శలు వచ్చాయి.
ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీనివల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతోందని పిటీషనర్లు పేర్కొన్నారు. టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని వాదించారు.
అయితే నిబంధనలకు అనుగుణంగానే నియామకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.