మరికొద్ది రోజుల్లోనే టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల త్వరలో తీరబోతున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల కలను నెరవేర్చేందుకు ముందడుగు వేసింది. జగన్ కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయంతో సుమారు 15 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు దక్కనున్నాయి. ఈ మేరకు నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట సమీపంలో సుమారు 300 ఎకరాలను సేకరించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చొరవతో ఇంటి స్థలాల పంపిణీకి మార్గం సుగమమైంది.
Also Read: ఆ ఆరుగురే ఎమ్మెల్సీ అభ్యర్థులు.. జగన్ డిసైడ్?
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తన మాటను నిలబెట్టుకున్నట్టైంది. గత నెల 6వ తేదీన తిరుపతి పద్మావతి రెస్ట్‌హౌస్‌లో టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులతో ఇంటి స్థలాలపై చర్చించేందుకు భూమన చొరవ చూపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీటీడీ ఉద్యోగులతో కలిసి ఈ నెల 4న విజయవాడలో కలిశారు. ఇంటి స్థలాల విషయమై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునేందుకు ఒప్పించారు.
ఈ నేపథ్యంలో నిన్నటి కేబినెట్ సమావేశంలో టీటీడీ ఉద్యోగులకు వడమాలపేటలో ఇచ్చేందుకు 300 ఎకరాలు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో టీటీడీ ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. టీటీడీ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత నాడు తండ్రి వైఎస్సార్, నేడు ఆయన తనయుడైన జగన్‌కే దక్కడం విశేషం.
Also Read: మున్సి‘పోల్’కు ముందే పరిషత్ పోరు..: జగన్ ఆలోచన అదేనా..?
2008లో వైఎస్సార్ హయాంలో ఎస్వీ డెయిరీ ఫామ్, ఎస్వీ పూర్ హోమ్, బ్రాహ్మణపట్టు ప్రాంతాల్లో సుమారు 1,860 మందికి ఇంటి స్థలాలు కేటాయించారు. అలాగే ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల వెనుక వినాయక నగర్ క్వార్టర్స్ సమీపంలోని టీటీడీ స్థలాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించి 1100 మందికి ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే తిరుపతి పరిరక్షణ పేరుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు జగన్ సర్కార్ టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకుని వేగంగా అడుగులు వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్