TSPSC Paper Leak Case: పేపర్ లీకేజీల కేసు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పైగా నిందితుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమయంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పని తీరును మరింత మెరుగుపరచుకొని విమర్శకులకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన బోర్డు.. ఇంకా ఆగాధంలోకి కూరుకు పోతోంది. ఒక రాష్ట్రానికి సంబంధించి వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యతను తలకు ఎత్తుకున్న బోర్డు.. ఆ బాధ్యతను నిర్వర్తించలేక మరింత అభాసుపాలవుతోంది. అనేకానేక వివాదాలు, లీకుల తలనొప్పులు, సుదీర్ఘ కాలయాపన తర్వాత ఎట్టకేలకు నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలోనూ అదే డొల్లతనం కనిపించింది. అనేకమంది నిరుద్యోగుల కల అయిన గ్రూప్_1 పరీక్ష ప్రశ్న పత్రం రూపకల్పనలోనూ నెత్తి మాసిన విధానాన్ని అవలంబించింది. పైగా పరీక్షకు దరఖాస్తు చేయకపోయినప్పటికీ ఓ యువతికి హాల్ టికెట్ పంపించి.. తానే ఘనాపాటి అనిపించుకుంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా దేశానికి రోల్ మోడల్? అనే ఆరోపణలు సరేసరి. కొంతమంది ఒక అడుగు ముందుకేసి అధికారిక కరపత్రం “నమస్తే తెలంగాణ”లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాసిన వార్తలను ఉటంకిస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఇదేం ప్రశ్న పత్రం?
ప్రశ్న పత్రం రూపకల్పనలోనూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు ఇష్టానుసారంగా వ్యవహరించింది. నిజానికి ఈ పరీక్ష పత్రం లోపభూయిష్టంగా ఉందని ఒక సెక్షన్ బ్యాచ్ మండిపడుతోంది. నిజంగా ఇది నాణ్యమైన పరీక్ష పత్రమేనా? అభ్యర్థుల తెలివితేటలను నిగ్గు తేల్చే సత్తా ఉన్నదేనా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. గతంలో జరిగిన అర్హత పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయిన నేపథ్యంలో.. గడచిన ఆదివారం బోర్డు పరీక్ష నిర్వహించింది. అంతకుముందు నిర్వహించిన పరీక్ష చాలా కఠినంగా ఉందని చెప్పారు. అంతకముందు అర్హత సాధించని వాళ్లలో కొందరు ఈసారి ఒక్కింత ఆశావాదంతో పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే పేపర్ అంతకుమించి కఠినంగా ఉందని, ఇంతకుముందు అర్హత సాధించిన వాళ్లలో కొందరు ఇప్పుడు గట్టెక్కలేరని, అభ్యర్థుల మీద కక్ష సాధింపుగా ఈ పేపర్ ఉందని చాలామంది చెప్తున్నారు. కోచింగ్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కటాఫ్ 70కి మించి ఉండదని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 150 ప్రశ్నలలో సగానికి మించినవి అభ్యర్థులకు తెలియనివి రూపొందించారని అర్థమవుతున్నది.
ఇలా ఎలా రూపొందిస్తారు?
వాస్తవానికి పోటీ పరీక్షలకు సంబంధించి బోర్డు ఒక సిలబస్ ప్రకటిస్తుంది. సిలబస్ లో ఉన్న ప్రశ్నలను పరీక్షలో అడుగుతుంది. అంతటి యుపిపిఎస్సి కూడా ఇదే సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది.. భారతదేశానికి రోల్ మోడల్ అనే చెప్పుకునే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అందుకే ఔట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా సమాధానాలు ఒక పట్టానా దొరకడం లేదని కోచింగ్ ఫ్యాకల్టీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పేపర్లో నేరుగా సంధించిన ప్రశ్నలు 37 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రశ్ని ఇచ్చి కింద నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం లాంటిది. ఇందులో కూడా మూడు ప్రశ్నలు సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టాల్సినవి ఉన్నాయి. ఒక ప్రశ్న లేని దాన్ని గుర్తించే ప్రశ్న. మిగతా 93 ప్రశ్నలు స్టేట్మెంట్ రూపంలో ఉండి, ఇందులో ఏవి తప్పు, ఏవి సరైనవో లేక జతపరిచే పద్ధతిలో జవాబులను గుర్తించాలి. ఇవి చాలా క్లిష్టమైనవి. సమయం చాలా తీసుకునేవి. ఈ పద్ధతిలో ఒక ప్రశ్న నాలుగు ప్రశ్నలతో సమానం. ఇలాంటివి 93 ఉన్నాయి. ఇవే 372 ప్రశ్నలతో సమానం. ఇక మిగతా 20 ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు. ఇవి ఆలోచించి రఫ్ వర్క్ చేసి సమాధానం గుర్తించాల్సినవి. ఈ కారణంగా చాలామంది నిరాశ చెంది ఏదో ఒకచోట బబ్లింగ్ చేసామని చెబుతున్నారు. వాస్తవానికి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్నలను యుపిఎస్సి బోర్డు కూడా తక్కువ స్థాయిలోనే అడుగుతుంది. అదేంటో తెలియదు గాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సిని మించిన విధంగా ప్రశ్నలు అడిగింది. స్థూలంగా చెప్పాలంటే అభ్యర్థుల మీద కక్ష సాధింపు నకు పాల్పడింది. పేపర్ మొత్తం ఇలాగే ఉండడంతో అభ్యర్థులకు చిరాకు లేచింది. వాస్తవానికి అభ్యర్థులకు ఏం వచ్చో తెలుసుకోవడం కంటే, ఏం రాదో అడగాలని ఉంటుంది. ఈ ధోరణి ప్రిలిమ్స్ పేపర్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
ఇవి పాటించారా?
ప్రశ్న పత్రాలు రూపొందించేటప్పుడు కొన్ని విషయాలు పాటించాలి. మెజారిటీ విద్యార్థులు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉండాలి. కనీసం సగం ప్రశ్నలు పాఠ్యపుస్తకాలు నుంచి ప్రిపరేషన్ నుంచి గుర్తించేదిగా ఉండాలి. పైగా ఇవన్నీ డైరెక్ట్ ప్రశ్నలుగా ఉండాలి. 25% అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు ఉండాలి. మరో 25% కామన్ సెన్స్ తో జవాబులు గుర్తించే విధంగా ఉండాలి. స్టేట్మెంట్ల రూపంలో ఉండే డబుల్ మల్టిపుల్ ప్రశ్నలు 25% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలా ప్రశ్నపత్రం రూపొందించాలి. పరీక్ష రాసి బయటకు వచ్చిన అభ్యర్థి సంతోషపడాలి. ప్రశ్నపత్రం రూపొందించిన వాళ్లపై గౌరవం పెరగాలి. ఉద్యోగం పైన ఆశ కలగాలి. లేదా ఇంకా కొంచెం ప్రయత్నిస్తే బాగుండేదని అనిపించాలి. కనీసం కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే విధంగా అయినా ఉండాలి. పైవేవీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు పట్టించుకోలేదు. పేపర్ లీకేజీ అయింది కాబట్టి, అదేదో అభ్యర్థుల తప్పు అయినట్టు వ్యవహరించింది. అభ్యర్థుల మీద కోపం పెంచుకొని ప్రశ్న పత్రం రూపొందించింది. మా ఇష్టం ప్రశ్నలు ఇలాగే ఉంటాయి, మీ మీ చావు మీరు చావండి అంటూ బుర్ర బద్దలయ్యే ప్రశ్నలతో ప్రిలిమ్స్ పేపర్ రూపొందించింది. ఈ పేపర్లో కనీసం 70 మార్కులు వచ్చినా గొప్పే అని తలలు పండిన ఫ్యాకల్టీ నిపుణులు అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు దరఖాస్తు చేయని ఓ యువతికి హాల్ టికెట్ పంపిన బోర్డు సభ్యులు.. ప్రశ్నపత్రం రూపొందించడంలో ఎంత చొరవ తీసుకున్నారు ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో బోర్డును ప్రక్షాళన చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్ సబబే అనిపిస్తుంది.