Online Classes: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రంగాల్లో మొదటి స్థానంలో ఉంటుంది విద్యారంగం. దేశంలో ఇతరత్రా రంగాలన్నీ కాస్త ముందూ వెనకా గాడిలో పడ్డాయి. కానీ.. విద్యా రంగం మాత్రం ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. రాబోయే రోజుల్లోనూ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే విద్యాసంస్థలు తెరిచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ (Private Schools) తెరుచుకోవాల్సిందేనని.. ఆఫ్ లైన్ లోనే విద్యా బోధన జరగాలని చెప్పింది. ఆన్ లైన్ తరగతుల నిర్వహణకు అవకాశం లేదని వెల్లడించింది.
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండడంతో.. ప్రైవేటు యాజమాన్యాలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ శుద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అయితే.. విద్యాసంస్థలు తెరవాలని సర్కారు ఆదేశించినప్పటికీ.. పలు సందేహాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడం కూడా ఈ సందేహాలకు కారణమవుతోంది.
ఆన్ లైన్ విద్యకు అవకాశం లేదని, ప్రత్యక్ష బోధనకే సిద్ధం కావాలని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం. అంతేకాదు.. విద్యాశాఖ పాఠశాలలకు జారీచేసిన మార్గదర్శకాల్లోనూ ఈ విషయం చెప్పలేదు. టీవీ పాఠాలు బోధించే టీశాట్ అధికారులకు కూడా ఈ విషయమై అధికారిక సమాచారం ఏదీ అందలేదని చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. విద్యార్థుల హాజరు విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. పాఠశాలలు ఓపెన్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. విద్యార్థులను బడికి పంపాలని బలవంతం చేయొద్దని చెబుతోంది. అదే సమయంలో ఆన్ లైన్ తరగతులు నిర్వహించొద్దని ప్రకటించింది. మరి, బడికి వెళ్లని విద్యార్థుల పాఠాల సంగతి ఏంటీ? అన్నదానిపై స్పష్టత లేదు. అంటే.. వాళ్లు చదువు మానేయాలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇంకోవైపు.. కరోనా కేసులు పెరిగితే ఏం చేయాలన్నదానిపై విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. కేసులు ఎక్కువైన పాఠశాలను మూసేయాలని చెప్పింది. ఇదే జరిగితే.. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఏమిటి? రాష్ట్రంలోని మిగిలిన విద్యార్థులంతా చదువుకుంటుంటే.. వీళ్లు మాత్రం చదువుకు దూరం కావాలా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇలా.. పలు సందేహాలు ఉన్నాయి. మరి, వీటికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందన్నది చూడాలి.