ట్రంప్ ప్రభావం ఇప్పట్లో పోదు
ఈమాట అంటే అదేదో ట్రంప్ మీద అభిమానంతో అన్నట్లు కాదు. సమాజంలో వచ్చిన విభజన చిన్నదేమీ కాదని చెప్పటమే మా ఉద్దేశం. ఇంతకుముందు వ్యాసంలో చెప్పినట్లు ఈ విభజన ఈ ఎన్నిక ఓటమితో పోయేదికాదు. గ్రామీణ ప్రాంతం ఇప్పుడు ఏకమైనంతగా ఎప్పుడూ సమీకరించబడలేదు. శ్వేత జాతీయులు ఇప్పుడు సమీకరించబడ్డట్టు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఈ విభజన ఒక్కసారి ఎన్నికైనప్పుడే అంతమవుతుందని అనుకోలేము. ముందు ముందు బైడెన్ తీసుకొనే చర్యలని బట్టి ఇది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చెప్పగలం. ట్రంప్ నోటికి అడ్డు అదుపు లేదు కాబట్టి గెలవలేకపోయాడని అర్ధమవుతుంది. అయినా అన్ని సంస్థలు చెప్పినంత గ్యాప్ జాతీయ స్థాయిలోనూ లేకపోవటం విశేషం. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని, కరోనా మహమ్మారి పై మాట్లాడేటప్పుడు చూపించాల్సిన కరుణ, తీవ్రత వ్యక్తపరిచి వుంటే త్రుటిలో జారిపోయిన ‘పోటీ’ రాష్ట్రాల్లో ఫలితం తారుమారై వుండేది. ట్రంప్ మీద వచ్చినన్ని విమర్శలు ఏ అధ్యక్షుడి మీద రాలేదు. ప్రాతినిధ్య సభలో అభిశంసనను ఎదుర్కున్నాడు కూడా. ప్రజల్లో ఎంత మంది అభిమానులున్నారో అంతకన్నా ఎక్కువమంది ద్వేషించారు కూడా. ఇందులో చాలావరకు స్వయం కృతాపరాధాలే. 2 లక్షలకు పైగా కరోనా బారిని పడి మృత్యువాత పడ్డారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోరాడి ఓడాడు అంటే చిన్న విషయం కాదు. ముఖ్యంగా చివరి రెండు,మూడు వారాలు తను తిరిగిన ప్రదేశాలు, మాట్లాడిన సభలు, తన అభిమానుల్ని వుర్రూతలూగించిన తీరు అందరికి ఆశ్చర్యమేసింది. 74 సంవత్సరాల్లో అదీ కరోనాబారిన పడి లేచివచ్చి అంతటి శక్తిని కూడగట్టుకొని తిరగటం ఓ రికార్డ్. దీనితో పోలిస్తే బైడెన్ పడ్డ కష్టం నథింగ్. కాకపోతే ఈ ఎన్నిక బైడెన్ శక్తి యుక్తుల మీద కన్నా ట్రంప్ పై రిఫరండంగా చూడాలి. బైడెన్ కేవలం ఒక బొమ్మనే. ఈ విషయంలో డెమోక్రాట్ల వ్యూహం సరైనదే. విమర్శల సుడిగుండంలో లేని వ్యక్తిని పెడితే మిగతా పని దానంతట అదే జరుగుతుందని అనుకున్నారు. ప్రజలు ట్రంప్ ని రెండోసారి ఎన్నుకోవాలా వద్దా అనే చర్చకే పరిమితమయ్యారు. ఆ వ్యూహానికి బైడెన్ సరిగ్గా అతికినట్లు సరిపోయాడు.
ట్రంప్ మానియా అనేది ఒక్కరోజులో పొయ్యేది కాదు. ఇంతకుముందు రెండోసారి గెలవని జార్జి బుష్, జిమ్మీ కార్టర్ ల ప్రభావం అంతగా లేదు. కాని ట్రంప్ తనంతట తాను తప్పుకుంటే తప్పితే కనీసం వచ్చే రెండేళ్ళ తర్వాత జరిగే ప్రాతినిధ్య సభ ఎన్నికలు, సెనేట్ ఎన్నికల వరకు తన హవా రిపబ్లికన్లలో కొనసాగే అవకాశం వుంది. అందరూ అనుకున్నట్లు ఇంత వివాదాల మధ్యకూడా ట్రంప్ రిపబ్లికన్లలో 93 శాతం మందిని కూడగట్ట గలిగాడు. అదీ మిట్నీ రోమ్నీ, లింకన్ ప్రాజెక్టు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించిన నేపధ్యంలోనని మరవొద్దు. ట్రంప్ హయాంలో నల్ల జాతీయుల, లాటినో వాసుల ఓట్ల శాతాన్ని అంతకుముందు కంటే రిపబ్లికన్లు పెంచుకోగలిగారు. అదే సమయంలో పారిశ్రామిక కార్మికులు పెద్దమొత్తంలో ట్రంప్ వైపు జమ అయ్యారు. మరి వీరు ఇప్పట్లో తిరిగి డెమోక్రాట్ల వైపు రావటం ఒక్క రోజులో జరిగేపని కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే తను ఓ కల్ట్ ని తయారు చేసుకోగలిగాడు. ఇంతకుముందు ఏ రిపబ్లికన్ అభ్యర్ధి ఈ స్థాయిలో ప్రజల్ని సమీకరించుకోలేదు. ఈ సమీకరణలను ఏమేరకు తగ్గి సమైక్యం చేస్తాడో, ఎలా చేయబోతున్నడో నని ప్రజలు, మేధావులు బైడెన్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ట్రంప్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు అధికారాన్ని అంత తేలికగా వదులు కోడని చెబుతున్నారు. కానీ అది సాధ్యంకాదు. కోర్టులో రిపబ్లికన్ మద్దత్తుదారులు మెజారిటీలో వున్నా ఎప్పటినుంచో వున్న ఎన్నికల పద్దతులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ట్రంప్ కి అధికారం వదులుకోక తప్పదు.
బైడెన్-కమలా హారిస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది?
ముందుగా చెప్పాల్సి వస్తే భారత-అమెరికా సంబంధాలపై ఈ అధికార మార్పు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఇంతకుముందు వ్యాసాల్లో ప్రస్తావించు కున్నట్లు ఇరువురికి ఈ సంబంధాల బలోపేతం అవసరం. ఇండో-పసిఫిక్ జోన్ లో భారత్ కీలకం. కాబట్టి ఆవిషయం పక్కనబెట్టి అమెరికా అంతరంగిక పరిపాలన లో వీరివురు ప్రభావం ఎలా వుంటుందో చర్చించుకుందాం. ఈసారి జరిగిన ముఖ్య పరిణామం డెమోక్రాట్లలో ఐక్యత నెలకొనటం. దీని ప్రభావం పరిపాలనపై పడబోతుందా అనేదే ప్రధానంగా అందరూ ఆలోచిస్తుంది. వుంటే ఏమేరకు వుంటుంది? ఎందుకంటే ఈసారి వామపక్షవాదుల అభిప్రాయాల్ని బైడెన్ విస్మరించటం కుదరకపోవచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. అన్నీ కాకపోయినా ఆర్ధిక విధానాలలో వారి అభిప్రాయాన్ని తీసుకొని వయా మీడియా గా వెళ్ళటానికే బైడెన్ ప్రయత్నించవచ్చు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం వుంది. ఇప్పటికే ట్రంప్ దీనిపై ప్రజల్ని రెచ్చగొట్టి ఉండటంతో బైడెన్ వీటిపై ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు వున్నాయి. ముఖ్యంగా అందరూ ఎదురుచూస్తుంది ఒబామా కేర్ లో తీసుకొచ్చే మార్పులు ఎలా వుండబోతున్నాయనేదే. పన్నులు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు 4లక్షల డాలర్లు పైబడిన వారికేనే,దిగువకు కూడా అమలుచేస్తారా అనేది చూడాలి.
భారత్ దగ్గరకు వచ్చేసరికి కాశ్మీర్ విషయం లో బైడెన్ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది, ఐక్యరాజ్యసమితిలో భారత్ కి శాశ్వత సభ్యత్వంపై ఎలా స్పందించబోతుంది, చైనా విషయంలో ఎలా వ్యవహరించబోతుంది అనేవి కీలకం కాబోతున్నాయి. వచ్చే అయిదు సంవత్సరాలు బైడెన్ వుండేటట్లయితే భారత్ తో సంబంధాలు బలపడటం ఖాయం. వామపక్షవాదుల ప్రభావం భారత్ సంబంధాల విషయం లో బైడెన్ ప్రభుత్వంపై ఉండకపోవచ్చు. అందరూ అనుకుంటున్నట్లు బైడెన్ ఎక్కువకాలం ఉండడనేది కేవలం ఊహాగానమే. ఇవ్వాల్టి రోజుల్లో 82 సంవత్సరాలు బతకటం సర్వ సాధారణం, అదీ అమెరికా జీవన ప్రమాణాలలో. ఎన్నికల్లో ట్రంప్ మాటలకి అర్ధాలు వేరులే అని మనం సర్దుకు పోవాలి సుమా.