
జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు టైమ్ దగ్గర పడుతోంది. గ్రేటర్ పాలకవర్గం కొలువుదీరేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు సీల్డ్ కవర్‌లోనే ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కాబోయే మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరా అని అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
Also Read: పాదయాత్రతోనైనా పీసీసీ పీఠం రేవంత్ కు లభిస్తుందా?
ఎట్టకేలకు మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎక్కువ మెజార్టీ ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కనున్నాయి. ఈనెల 11న నిర్వహించే ప్రత్యేక సమావేశానికి మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. కోరం లేకపోవడం లేదా ఇతర అసాధారణ పరిస్థితులు ఎదురైతే మాత్రం ఎన్నిక వాయిదా పడుతుంది. రెండో సారి సమావేశం జరిగే సమయంలో ముందు రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయరో.. ఆ కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అప్పుడే వారికి ఓటేసే హక్కు వస్తుంది. కోరం లేకపోతే మళ్లీ సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మూడోది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. అప్పుడు కోరంతో పనిలేకుండానే ఎక్కువ మంది మద్దతు తెలిపిన వ్యక్తులే మేయర్‌గా ఎన్నికవుతారు.
లింగోజిగూడ కార్పొరేటర్‌గా గెలిచిన అభ్యర్థి ఇటీవల మృతిచెందారు. 149 మంది కార్పొరేటర్లకు తోడు గ్రేటర్‌లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగి ఉంటారు. వీరు 44 మంది ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ లెక్కతేల్చింది. తద్వారా సమావేశానికి హాజరయ్యే మొత్తం సభ్యుల సంఖ్య 193కి చేరుతుంది.
కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రమాణ పత్రాలను సిద్ధం చేసింది. ఇక.. మేయర్ ఎన్నిక పూర్తికాగానే ప్రిసైడింగ్ అధికారి అక్కడే ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అనంతరం మేయర్ పీఠంపై కూర్చుంటారు.
మరోవైపు పార్టీల బలాబలాలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పొరేటర్ల, 32 మంది ఎక్స్‌అఫిషియోలు.. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియోలు.. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌అఫిషియోలు ఉన్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.
ఉదయం 10.45 గంటలకు సభ్యులు ఏదేని ఫొటో గుర్తింపు కార్డుతో కౌన్సిల్ హాల్‌కు రావాలి. సమావేశ నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారి ద్వారా అందిన నోటీసు, వ్యక్తిగత వివరాల ప్రతిని తీసుకురావాలి. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. పార్టీల వారీగా బరిలో ఉన్న వారి పేర్లు ఇవ్వాలని పీవో కోరుతారు. సభ్యులు చేతులెత్తే విధానంలో మద్దతు తెలపాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులకు ఓటు ఉంటుంది. వారి సంఖ్య కనీసం 50 శాతం ఉంటేనే ఎన్నిక నిర్వహించాలి. కోరం లేని సందర్భంలో 50 శాతం సభ్యుల హాజరు కోసం పీవో 1.30 గంటల వరకు వెయిట్ చేస్తారు. అయినా లేకుంటే మేయర్ ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు.
Also Read: తెలంగాణలో ‘షర్మిల కొత్త పార్టీ’ కోలాహలం?
మరోవైపు.. మేయర్ ఎన్నికలో గెలిచే అవకాశం లేకున్నా.. పోటీలో నిలిచేందుకు మాత్రం బీజేపీ కసరత్తు చేస్తోంది. తాము బరిలో ఉంటే టీఆర్‌ఎస్, మజ్లిస్‌ల పొత్తును తేటతెల్లం చేసినట్లు అవుతుందని భావిస్తోంది. పోటీ ఖాయమైతే బీజేపీ తరఫున ఎవరిని బరిలో దించాలనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
మరోవైపు అధికార పార్టీలో కూడా ఎవరు మేయర్‌గా ఎన్నికవుతారా అని చర్చ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే అధిష్టానంపై పలువురు కార్పొరేటర్లు ఒత్తిడి తెస్తున్నారు. కాగా.. ఈసారి మహిళకే మేయర్ పదవి ఇస్తుండడంతో.. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మికి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మేయర్ రామ్మోహన్ తన భార్య, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నారు. అలాగే.. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి సైతం పదవిని ఆశిస్తున్నారు. వెంకటేశ్వరనగర్, భారతీనగర్ కార్పొరేటర్లు కవితారెడ్డి, సింధురెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్‌గా మైనార్టీ వర్గానికి చెందిన వారినే ఎంపిక చేసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Comments are closed.