TRS to BRS : 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో జాతీయస్థాయిలో కేవలం రెండు మూడు పార్టీలే చక్రం తిప్పాయి. కమ్యూనిస్టులను పక్కనపెడితే అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీనే.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం కమ్యూనిస్టు పార్టీకి రాలేదు. దీంతో వీరిని పక్కనపెడితే ఉన్న రెండు పార్టీలనే ప్రజల మారుస్తూ పాలించుకున్నారు. మరో మూడో ప్రత్యామ్మాయం రాలేదా? అంటే చాలా మంది ప్రయత్నించారు. విఫలమయ్యారు.
తెలంగాణ రాదు అనుకున్న అనుమానాల నుంచి రాష్ట్రాన్ని సాధించి రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయ స్థాయికి పడ్డాయి. దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఈరోజు పురుడుపోసుకుంది. దేశంలో కొత్త రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో ‘భారత్ రాష్ట్రసమితి’ ఏర్పాటైంది.
టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో లేఖ పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ ఈరోజు ముహూర్తం చూసి మరీ మధ్యాహ్నం 1.20 గంటలకు సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్రసమితి అమలులోకి వచ్చేసింది.
ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా పార్టీ రంగు మాత్రం ‘గులాబీ’నే ఎంచుకున్నారు. గులాబీ జెండాలో తెలంగాణ స్థానంలో భారత్ వచ్చి చేరింది. ఇక బీఆర్ఎస్ కు కూడా టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’నే కొనసాగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది.
-తెలంగాణలో నిలిచి గెలిచిన కేసీఆర్ జాతీయ అడుగులు ఫలిస్తాయా?
రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఎలాగైనా సరే ఒక్కరోజులో రాజకీయాలను మార్చగల శక్తి సంపన్నుడు. అందుకే కేసీఆర్ పై బీజేపీ కూడా ఓ నజర్ వేసింది. ఇటీవల తెలంగాణలో పలు మ్యాజిక్ లు చేసింది. అయితే కేసీఆర్ వాటిని తట్టుకొని.. అడ్డుకొని నిలబడ్డాడు. ఇప్పుడు జాతీయ స్థాయికి అడుగులు వేస్తున్నాడు. కేసీఆర్ ‘బీఆర్ఎస్’ జాతీయ పార్టీగా మారినా.. దానికి గుర్తింపు రావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6శాతం ఓట్లురావాలి. అప్పుడే జాతీయ పార్టీగా ‘బీఆర్ఎస్’ నిలుస్తుంది. దీనికి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలే కీలకం కానున్నాయి. ఇక్కడ మాత్రమే తొలుత బీఆర్ఎస్ కు అంతో ఇంతో అవకాశాలున్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఢిల్లీలో అనౌన్స్ చేసి తన ప్రణాళిక, వ్యూహరచన, ఇతర విషయాలు వెల్లడించి వచ్చే ఎన్నికల రంగంలోకి దూకే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో సాధించిన అధికారం దేశంలో సాధించాలంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నెట్ వర్క్ బలం ఉన్న జాతీయ పార్టీ అవసరం. మరి అది లేని కేసీఆర్ బీఆర్ఎస్ తో అంత విస్తరిస్తాడా? సాధ్యమయ్యేనా? అన్నవి భవిష్యత్తు నిర్ణయిస్తుంది.