Khammam Politics: ఖమ్మం కారు పార్టీలో ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. పొంగులేటి వర్గం, పువ్వాడ అజయ్ కుమార్ వర్గం, తుమ్మల నాగేశ్వర రావు వర్గం గా పార్టీ చీలి పోవడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పైకి అందరూ ఒకే వేదిక పంచుకున్న లోలోపల మాత్రం ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే, ఆర్ అండ్ బి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి.

ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. సాక్షాత్తు ఈ పంచాయతీ ఏకంగా కేటీఆర్ వద్దకు వెళ్ళింది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆయన ఏకంగా కందాల ఉపేందర్ రెడ్డి తన వద్దకు పిలిపించుకుని సముదాయించినట్టు సమాచారం. వీరే కాక ఇతర నేతల మధ్యలో అనేకసార్లు పాత, కొత్త నేతల మధ్య పంచాది పోలీస్స్టేషన్ల దాకా వెళ్లింది. ఖమ్మం, కొత్తగూడెం ఇల్లందు, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల మధ్య అంతరాలు రచ్చకెక్కాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని కొందరు తమ దారి తాము వెతుక్కునే పనిలో పడ్డారు. పార్టీకో, ప్రభుత్వానికో అవసరమైతే తప్ప నేతల మధ్య సర్దుబాటుకు టీఆర్ఎస్ హైకమాండ్ కనీసం ప్రయత్నించడం లేదని లీడర్లు గరం అవుతున్నారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న తమను పట్టించుకోకుండా, తమను అణచివేసినవాళ్లనే నెత్తిన పెట్టుకుంటున్నారని మండిపడుతున్నారు.
Also Read: Kcr: కొత్త పార్టీ కాదు.. ఉన్న టీఆర్ఎస్ నే ఇలా మారుస్తారట..
పార్టీ మారే ప్రయత్నాల్లో లీడర్లు
రాష్ట్రంలో కనీసం 30కి పైగా నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్‌లో బహు నాయకత్వం ఉంది. అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. వారిలో ఒకరిద్దరికి మాత్రమే పదవులు ఇచ్చారు. మిగతా వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ నాయకుల అనుచరులకు పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. కనీసం చిన్నపాటి పదవులు కూడా దక్కడం లేదు. దీంతో వాళ్లంతా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన బాటలోనే చాలామంది నాయకులు టిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూపుల లొల్లి కొనసాగుతున్నది. ఈ జిల్లాలో ఒక్క ఖమ్మం అసెంబ్లీలో తప్ప మరెక్కడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలువలేదు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర మెచ్చ నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు హరిప్రియా నాయక్ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో దాదాపు జిల్లా మొత్తం కొత్తగా పార్టీలో చేరిన వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. గతంలో టీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే కారణమని పలువురు అభ్యర్థులు నేరుగా సీఎం కేసీఆర్‌ను కలిసి కంప్లయింట్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇవ్వకున్నా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నారు. మొన్న జరిగిన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అతికష్టమ్మీద గెలిచారు. భారీగా అధికార పార్టీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేశారు. ఈక్రాస్ ఓటింగ్‌కూ పొంగులేటి కారణమని కొందరు లీడర్లు మళ్లీ కంప్లయింట్ చేశారు. కొంతకాలం కింద పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య పరస్పరం దాడులకు దారితీసింది. ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పాత నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య పూడ్చలేనంత అగాథం ఉంది. పాత నేతల్లో ఎక్కువమంది మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే ఉన్నారు. సీఎం కేసీఆర్ వనపర్తి పర్యటనకు ఆహ్వానం అందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం మీటింగ్ కొనసాగుతున్న సమయంలోనే ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటితో మంతనాలు జరిపారు. ఆ సమయంలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పిడమర్తి రవి ఉన్నారు. అసెంబ్లీకి ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటి ఆధ్వర్యంలో కీలక నేతలంతా సమాయత్తం అవుతున్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన వడ్ల ర్యాలీలో సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కౌన్సిలర్ భర్త బైక్‌తో ఢీకొట్టి కిందపడేశాడు. ర్యాలీలో ఆమె కన్నీటి పర్యంతమైతే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సర్ది చెప్పారు.
ఇక ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆ మధ్య పర్యటిస్తున్నప్పుడు టిఆర్ఎస్ లోని ఓ వర్గం నాయకులు ఆమెను అడ్డుకున్నారు. వాళ్లకు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పిన వినిపించుకోలేదు. మరోవైపు మంత్రి ఇ అజయ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టిఆర్ఎస్ లోని ఓ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల చర్చి కాంపౌండ్ లో ఓ మత చిహ్నాన్ని ఆవిష్కరించేందుకు యత్నించగా గా బిజెపి నాయకులు అడ్డుకున్నారు. దీనిపై నగర ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆ చిహ్నం స్థానంలో మదర్ తెరిసా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. ఇది చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ గొడవ సద్దుమణిగాక బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఇది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, టిఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకు వచ్చింది. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చాలా దుమారం లేపాయి. ఇవి పువ్వాడ అజయ్ కుమార్ సొంత సామాజిక వర్గంలో చర్చకు దారితీశాయి. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఏకంగా తన సొంత సామాజిక వర్గం లో మరో సంఘాన్ని పువ్వాడ అజయ్ కుమార్ తెరవెనుక ఉండి ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఖమ్మంలోని సీక్వెల్ క్లబ్లో భారీ ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేశారని వినికిడి.