నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాటల దాడి మొదలు పెట్టారు. సీఎం ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి కొనసాగిస్తున్నారంటూ.. ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎదురుదాడి మొదలు పెట్టారు.
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఒక మేకవన్నె పులి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని అన్నారు. ఈటల హుజూరాబాద్ వెళ్తే బీసీ అవుతారని, హైదరాబాద్ కు వస్తే ఓసీ అవుతారని ఎద్దేవా చేశారు. నీ వ్యాపారంలో బీసీలు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని అన్నారు.
మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా విమర్శలు గుప్పించారు. తనకు గౌరవం ఇవ్వలేదని ఈటల చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఫ్లోర్ లీడర్ గా, మంత్రిగా ఈటలకు అత్యంత గౌరవం దక్కిందన్నారు. అయితే.. ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో అర్థం కావడం లేదన్నారు. అసైన్డ్ భూములు కొన్నట్టు ఆయనే ఒప్పుకున్నారని, అది తప్పని తెలియదా? అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈటలను తప్పుబట్టారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చులకన చేయడం సరికాదన్నారు.
ఇదిలాఉంటే.. రేపటి నుంచి తనపై తనపార్టీ వాళ్లతోనే విమర్శలు చేయిస్తారని నిన్న ప్రెస్ మీట్లో ఈటల చెప్పడం గమనార్హం. అన్నట్టుగానే మర్నాడే మంత్రులు మాటల దాడి కొనసాగించారు. ఈ పరిస్థితి ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.