https://oktelugu.com/

Ram Column: బ్రాహ్మణ, బనియా ముద్ర నుంచి సామాజికన్యాయ దిశగా బీజేపీ పరివర్తన

Ram Column: బీజేపీ పార్టీ ఇన్నాళ్లు అగ్రవర్ణాల పార్టీగానే ముద్రపడుతూ వచ్చింది. ముఖ్యంగా బీజేపీకి మరోపేరు బ్రాహ్మణ, బనియా పార్టీ. ఎందుకంటే దీని పూర్వరంగం జనసంఘ్ కూడా అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉండేది. చాన్నాళ్లు అందుకే ఇది గ్రామాలకు విస్తరించలేదు. జనతాపార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాతకూడా ఇదే ఆధిపత్యం కొనసాగేది. అలాగే పార్టీ అత్యున్నత పార్లమెంటరీ బోర్డులో కూడా బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగింది. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ హిందూ జాతీయవాది పార్టీ. […]

Written By:
  • Ram
  • , Updated On : August 18, 2022 8:32 am
    Follow us on

    Ram Column: బీజేపీ పార్టీ ఇన్నాళ్లు అగ్రవర్ణాల పార్టీగానే ముద్రపడుతూ వచ్చింది. ముఖ్యంగా బీజేపీకి మరోపేరు బ్రాహ్మణ, బనియా పార్టీ. ఎందుకంటే దీని పూర్వరంగం జనసంఘ్ కూడా అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉండేది. చాన్నాళ్లు అందుకే ఇది గ్రామాలకు విస్తరించలేదు. జనతాపార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాతకూడా ఇదే ఆధిపత్యం కొనసాగేది. అలాగే పార్టీ అత్యున్నత పార్లమెంటరీ బోర్డులో కూడా బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగింది. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ హిందూ జాతీయవాది పార్టీ. మొదట్లో హిందుత్వ సిద్ధాంతాన్ని భుజాన వేసుకొని మోసిన సామాజికవర్గం బ్రాహ్మణ, బనియాలే. అందుకే అది విస్తృత ప్రజానీకంలో ఆదరణ పొందలేకపోయింది. ఇదే అంశాన్ని ప్రత్యర్థి పక్షాలు బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగారు.

    Ram Column

    BJP parliamentary board meeting

    క్రమ క్రమేణా ఈ రూపం మారటం మొదలయ్యింది. దీని మాతృ సంస్థ ఆర్ ఎస్ ఎస్ కూడా దీనిపై దృష్టి పెట్టింది. హిందూవాదం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలంటే ఈ సామాజిక వివక్ష నుండి బయటపడకుండా సాధ్యంకాదని అర్ధంచేసుకుంది. అందుకే దాని సంస్థల్లో అన్ని వర్ణాల, వర్గాల ప్రజల్ని ప్రోత్సహించటం విధిగా చేస్తూవచ్చింది. అందులో భాగంగానే మన తెలుగువాడు, దళితుడైన బంగారు లక్ష్మణ్ ను అధ్యక్షుడిగా చేసింది. ఆకోవలోనే వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ కూడా అధ్యక్షులుగా చేశారు. ఈ సామాజిక పరివర్తన వచ్చిన తర్వాతనే బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. దీని పరాకాష్ఠనే బీసీ కులానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగాడు. అయినా బీజేపీ పై అగ్రవర్ణ ముద్ర పూర్తిగా చెరిగిపోలేదు. దీనికి కారణం లేకపోలేదు. సామాజికన్యాయం అంశంపైనే ఏర్పడ్డ పార్టీలు రాజకీయరంగంలో ఉండటంతో చాన్నాళ్లు బీసీలు, దళితులూ, ఆదివాసులు పార్టీని స్వంతం చేసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే మిగతాపార్టీల లాగా బీజేపీ సామాజిక చైతన్యం ఒక్కటే ఇరుసుగా పనిచేసే పార్టీ కాదు. అన్ని వర్ణాలు కలిసి మెలిసి ఒకటిగా ముందుకెళ్లాలని చెబుతూ వచ్చింది. అంటే యోగ్యత ఆధారంగా నడవాలని భావించింది. అదేసమయంలో సామజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించనూ లేదు.

    Also Read: Private Medical Colleges Telangana: తెలంగాణలో అమ్మకానికి ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. వైద్య విద్య కూడా ఇంజనీరింగ్ లాగా మారుతోందా?

    ఈ స్థితి దీర్ఘకాలం కొనసాగింది. 2014 లో మోడీ అధికారంలోకి వచ్చినతరువాత పరిస్థితుల్లో మార్పు రావటం మొదలయ్యింది. ప్రతి ఎన్నికని సీరియస్ గా తీసుకోవటం మొదలుపెట్టింది. ఎప్పుడయితే ఎన్నికలే ధ్యేయంగా పనిచేయటం మొదలుపెట్టిందో క్షేత్ర స్థాయీ పరిస్థితులపై అవగాహన మరింత పెరిగింది. ప్రత్యర్ధులు బీజేపీపై విసిరే అస్త్రాలు ఏమిటో క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సమాధానాలు కనుగొనే పనిలో పడింది. సుపరిపాలన ఒక్కటే అధికారంలో నిలబెట్టదని అర్ధం చేసుకుంది. భారతీయ సమాజంలో కులాన్ని విస్మరించలేమని అర్ధంచేసుకుని దాని దిశగా పార్టీ స్వరూపాన్ని మార్చటం మొదలుపెట్టింది. మోడీ పట్టు పార్టీపై పెరిగే కొద్దీ ఈ దిశగా అడుగులు పడుతూ వచ్చాయి. ఇటీవల కేంద్ర కాబినెట్ విస్తరణలో బీసీలు, దళితులూ, ఆదివాసులకు అగ్రస్థానం లభించింది. అలాగే ఉత్తర ప్రదేశ్ కాబినెట్ లోనూ అగ్రభాగం వెనకబడిన తరగతులకు ప్రాధాన్యం దక్కింది. మొత్తం వెనుకబడిన తరగతుల్లో ఒక్క యాదవులు తప్పించి మిగతావారు బీజేపీకే ఆ రాష్ట్రంలో గంపగుత్తగా ఓటు వేశారు. దళితులూ కూడా మాయావతి పార్టీ తరువాత బీజేపీ కే ఓటు వేశారు. ఉత్తర ప్రదేశ్ లో ఈ పరిణామం బీజేపీ స్వరూపాన్ని మార్చిందని చెప్పొచ్చు. అలాగే రాష్ట్రపతిగా మొదటిసారి దళితున్ని, రెండోసారి ఆదివాసీ మహిళను చేసి బీజేపీ సామాజిక న్యాయాన్ని పాటించటంలో ముందుంటుందనే సంకేతాన్ని పంపించటం జరిగింది.

    ఇప్పుడు బీజేపీ అత్యున్నత విభాగం పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ లో మొదటిసారి సమతుల్యతను పాటించారు. ఇప్పటివరకూ బీజేపీ హిందీ వాళ్ళ పార్టీ అనే ముద్ర ఉండేది. ఈ సారి అలా కాకుండా అన్ని ప్రాంతాలకి సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతుంది. మొత్తం 11మంది పార్లమెంటరీ బోర్డు, 15మంది ఎన్నికల కమిటీ లో చూసుకుంటే హిందీయేతర ప్రాంతాలకి సముచిత ప్రాధాన్యం కల్పించారు. 15 మందిలో 8 మంది హిందీయేతరులే. మోడీతో కలుపుకుంటే 9మంది. ఇది పెద్ద మార్పు. అలాగే ప్రాంతాలవారీగా చూసుకున్నా దక్షిణాదికి ప్రాధాన్యం లభించింది. 15మందిలో 4గురు దక్షిణాదివారే. ఇక సామాజికన్యాయం అంశంలో 6గురు బీసీ,ఎస్ సి , ఎస్ టి ల కు సంబంధించిన వారు. స్వయానా ప్రధానమంత్రినే బీసీ. ఇది బీజేపీ లో వచ్చిన సామాజిక మార్పుగా గుర్తించవచ్చు. ఇది పరిగణనలోకి తీసుకోకుండా ఉదారవాద, వామపక్ష మేధావులు బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అని ఇప్పటికీ ముద్ర వేయటం చూస్తున్నాం. విశేషమేమంటే అలా ఆరోపించే సిపిఎం లో మొన్నటిదాకా పోలిట్ బ్యూరో లో ఒక్క దళితుడు కూడా లేడు. ఇప్పటికీ అగ్రవర్ణాలే అగ్రభాగాన వున్నారు. కాబట్టి ఈ ఆరోపణలు గురివిందగింజ సామెతలాగా వున్నాయి.

    Ram Column

    BJP

    ఇక వార్తల్లో ప్రధానంగా వస్తున్న అంశం యోగీ ఆదిత్యనాథ్, హిమంత బిస్వ శర్మ లాంటి ఉద్దండుల్ని తీసుకోలేదని. ముఖ్యంగా యోగీ ని తీసుకోకపోవటంపై నా పరిశీలన. ఇందాకా మనం చర్చించిన అంశం సమతుల్యత. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటికే ఇద్దరు వున్నారు. మోడీ, రాజ్ నాథ్ సింగ్. 15మంది కమిటీ ని పరిశీలిస్తే ఏ ఒక్క రాష్ట్రం నుంచి ఇద్దరు కన్నా ఎక్కువ లేరు. అంటే ఒకే రాష్ట్రం ఆధిపత్యం వహించకుండా జాగ్రత్త పడ్డట్లేకదా. ఈ అంశాన్ని రాజకీయ పరిశీలకులు విస్మరిస్తున్నారు. రెండో అంశం రాజ్ నాథ్ సింగ్, యోగి సామాజిక పరంగా ఒకే వర్గం, అదీ ఒకే రాష్ట్రం నుంచి. కాబట్టి ఒకే రాష్ట్రం నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దర్నీ తీసుకోవటం అదీ ఆ చైతన్యం ఎక్కువున్న యూపీ నుంచి ఇంకా ఎక్కువ విమర్శలకు దారి తీసి ఉండేది. అంతమాత్రాన యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యత తగ్గిందనేది అనుకోవడంలేదు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ ల మినహాయింపు ఖచ్చితంగా రాజకీయకోణం నుంచి తీసుకుందే.

    మొత్తం మీద చూస్తే బీజేపీ కూర్పు సమతుల్యత దిశగానే సాగిందని చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు వాడైన లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు లోకి రావటం ముదావహం. లక్ష్మణ్ బీసీ నే కాదు , విద్యాధికుడు కూడా. వెంకయ్య నాయుడు తర్వాత ఆ స్థానంలోకి వెళ్లిన తెలుగువాడు డాక్టర్ లక్ష్మణ్. అదే సమయంలో కొన్ని లోపాలు ఉన్నాయనేది చెప్పకతప్పదు. ఒకటి అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న 79 సంవత్సరాల యడియూరప్పను తీసుకోవటం లోపం. కర్ణాటక సామాజిక కోణం ని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేసినట్ట్టుగా వుంది. ఏది ఏమైనా ఇది సమర్ధనీయం కాదు. రెండోది, తూర్పు ప్రాంతానికి అసలు ప్రాతినిధ్యం లేకపోవటం. బీహార్, బెంగాల్, ఒడిశా నుంచి ఏ ఒక్కరూ లేకపోవటం. మూడోది ముస్లిం, క్రిస్టియన్ ల నుంచి ఏ ఒక్కరూ లేకపోవటం. అంటే హిందువుల్లో అన్ని వర్గాలని సంతృప్తిపరిచారుగాని మైనారిటీల్లో అతి పెద్ద వర్గమైన ముస్లిం ల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం సమతుల్య లోపమనే చెప్పాలి. బీజేపీ హిందువుల పార్టీ అవొచ్చు, అంతమాత్రాన మిగతావాళ్లకు అటు పార్లమెంటులో, పార్టీ సంస్థల్లో చోటు కల్పించకపోవడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. ఇది దేశ సమగ్రతకు చేటు చేసే చర్యనే. క్లుప్తంగా చెప్పాలంటే హిందువుల్లో బీజేపీ అందరి పార్టీ, కానీ దేశంలో అందరి పార్టీ కాదనే చెప్పాలి. ముందు ముందు ఈ లోపాన్ని నాయకత్వం సరిచేసుకుంటుందని ఆశిద్దాం

    రామ్

    Also Read: Recession: మరో మాంద్యం తప్పదా..? అమెరికా కుదేలు.. భారత్ పరిస్థితి ఏంటి?

    Tags