
YCP : వైసీపీలో సీన్ మారుతోందా? వచ్చే ఎన్నికలు ఆ పార్టీకి అంత ఈజీ కాదా? సీఎం జగన్ అనుకున్నట్టు కొంతమంది కొత్త ముఖాలు తెరపైకి వస్తారా? బయట ప్రచారం జరుగుతున్నట్టు 60 మంది ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలుకుతున్నారా? ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈసారి ఏకంగా 11 మంది ఎంపీలు అసెంబ్లీకి పోటీచేయడానికి ఉవ్విళ్లూరుతున్నారన్న వార్త అధికార పార్టీలో హల్ చల్ చేస్తోంది. అందులో కొందరికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఎంపీలుగా పవర్ లేదని అసంతృప్తి..
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున 22 మంది ఎంపీలు గెలుపొందారు. అయితే గెలుపొందిన కొద్ది నెలలకే నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు పార్టీకి దూరమయ్యారు. రెబల్ గా మారారు. అయితే పేరుకే ఎంపీలు కానీ ఎటువంటి పవరూ లేకుండా పోయింది. పదవిని ఎంజాయ్ చేయలేకపోయామన్న ఆవేదన వారిని వెంటాడుతోంది. ఎంపీగా ఉన్నా నిర్థిష్టమైన నియోజకవర్గం అంటూ ఏదీ లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. గత ఎన్నికల్లో సమీకరణాల్లో భాగంగా చాలామంది ఎమ్మెల్యేగా పదవి నిర్వర్తించిన వారు సైతం ఎంపీగా పోటీచేయాల్సి వచ్చింది. అటువంటి వారంతా ఇప్పుడు పాత అసెంబ్లీ నియోజకవర్గాలపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ప్రయత్నాల్లో ఈ 11 మంది..
ఎన్నికలకు ఆరు నెలల ముందే టిక్కెట్లు కన్ఫర్మ్ చేస్తామని జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఎంపీలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అరకు ఎంపీ మాధవి సైతం పాడేరు అసెంబ్లీ స్థానం, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి సీటు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధా రాజోలు, పీ గన్నవరం, అమలాపురం ఈ మూడు స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి.. విశాఖ ఎంపీ సత్యానారాయణ విశాఖ తూర్పు నుంచి, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నూజివీడు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఉరవకొండ నుంచి, హిందూపరం ఎంపీ గోరంట్ల మాధవ్ కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు ఎంపీ ఆదాలకు హైకమాండ్ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.తిరుపతి ఎంపీ గురుమూర్తి గూడూరు నుంచి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సైతం అసెంబ్లీ సీటు అన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది.
సీనియర్ల విముఖత..
అయితే ఎంపీల విషయంలో జగన్ వేరే ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడున్న వారిలో చాలా మందిని తప్పించి సీనియర్లతో పోటీ చేయించాలని భావిస్తున్నారు. అప్పుడే ఆయా లోక్ సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సీట్లను ఈజీగా గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్ల దృష్టికి తీసుకెళ్లగా వారు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి వారిని ఎంపీగా పోటీచేయమంటే ససేమిరా అన్నట్టు సమాచారం. ఇస్తే అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వండి లేకపోతే లేదు.. అని అధినేత ముఖం మీద చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ సైతం పునరాలోచనలో పడినట్టు టాక్ వినిపిస్తోంది. పాత ముఖాలతోనే ఎంపీగా పోటీచేయిస్తారన్న ప్రచారం అధికార పార్టీలో ఊపందుకుంది.