Tragedy: తనకు వివాహేతర సంబంధం అంటగట్టారని ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. ఇద్దరు పిల్లలను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని యదేహళ్లి ప్రాంతానికి చెందిన వీణా(32) అనే మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఒక పాపకు ఏడేళ్లు, మరో పాపకు ఏడాది వయసు ఉంటుంది. సంక్రాంతికి అమ్మగారింటికి వెళుతున్నానని భర్తకు చెప్పి జనవరి 13న పిల్లలను తీసుకుని బయలుదేరిన మరుసటి రోజు హొన్నళి తాలూకాలోని యక్కనహళ్లిలో ఆమె మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న భర్త తన భార్యా, పిల్లల మృతికి హొలేహోన్నురు సమీపంలోని అరహతొళలు గ్రామానికి చెందిన సంతోష్, అతని భార్య ఆషా కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తన భార్య వీణకు పరిచయస్తులు కావడంతో సంతోష్ దంపతులకు రూ. 8లక్షలు అప్పుగా ఇచ్చామని, తిరిగి చెల్లించాలని కోరితే వారు నిరాకరించడంతో పాటు తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఊర్లో ప్రచారం చేశారని, దీంతో తన మానసికంగా కుంగిపోయిందని.. తనతో చెప్పుకుని ఎంతో బాధపడిందని పేర్కొన్నాడు.
Also Read: హ్యట్రిక్ తో ఆ హీరోయిన్ల రికార్డును సమం చేసిన ‘ఉప్పెన’ బ్యూటీ..!
ఈ క్రమంలోనే పండుగకు వాళ్ల అమ్మ వాళ్లింటికి వెళ్లొస్తానని చెప్పడంతో సరే అన్నట్టు తెలిపాడు. పిల్లలను తీసుకుని వెళ్లిన తన భార్య ఇంతలోనే కఠిన నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేదని వీణ భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆమె ఆత్మహత్యకు, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన సంతోష్ దంపతులను కఠినంగా శిక్షించాలని బాధితుడు డిమాండ్ చేశాడు.
వీణ తన ఇద్దరు పిల్లలతో హంచిన సిద్ధాపుర సమీపంలోని భద్రా కెనాల్ వద్దకు వెళ్లి భద్రా కాలువలో పిల్లలిద్దరినీ తోసిసి ఆ తర్వాత ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. ఆమె మృతదేహం నీళ్లలో కొట్టుకుని వచ్చి యక్కనహళ్లి సమీపంలో తేలగా, ఏడేళ్ల పాప మృతదేహం చెన్నగిరి తాలూకాలోని నల్లూర్ సమీపంలో దొరికింది. మరో పాప మృతదేహం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం పుకార్లు కాస్త ముగ్గురు నిండు ప్రాణాలను బలితీసుకుంది. నిందితులు సంతోష్, తన భార్య ఆషాను పోలీసులు ఈనెల 15న అరెస్టు చేశారు.