తెలంగాణ పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ కు దూకుడు నేర్పి 2023లో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి గుదిబండగా మారింది. తాజాగా ఆ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టుకు రేవంత్ రెడ్డి, ఉదయసింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. విచారణలో భాగంగా సాక్ష్యుల వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది అనంతరం విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వీడియోల సాక్షిగా అడ్డంగా బుక్కయ్యారు. గత ఆరేళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు ప్రలోభ పెట్టేందుకు టీడీపీ పార్టీ తరుఫున రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు దొరికిపోయారు. అప్పటి నుంచి కేసు విచారణ నడుస్తోంది.
ఇటీవలే ఈ కేసుకు సంబంధించి చార్జ్ షీట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. కాగా ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి కొద్దిరోజులు జైలులో ఉన్న విషయం తెలిసిందే. తర్వాత పరిణామాల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ పరిణామాలు ఎలా ఉంటాయో అనే చర్చ కొనసాగుతోంది.
ఓటుకు నోటు తర్వాత రేవంత్ రెడ్డి పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ వీడి కాంగ్రెస్ లో చేరారు. ఎంపీగా గెలిచారు. తదనంతరం దూకుడుతో ఏకంగా పీసీసీ పదవి చేపట్టారు. కేసీఆర్ కు ఫక్తు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించారు. తెలంగాణలో దళిత, గిరిజనులను ఏకంగా చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి లూప్ హోల్ పై కొడుతోంది. ఓటుకునోటు కేసును టీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మలుచుకుంటోంది. ఎప్పుడు ఏ సంఘటన చోటుచేసుకున్నా.. ఓటుకు నోటు కేసునే అధికార టీఆర్ఎస్ నేతలు ముందుకు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కోర్టుకు హాజరుకావడంతో టీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.