
మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతిని జయప్రదం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీని కోసం ఇప్పటకే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఊరూరా వర్ధంతి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మెడికల్ క్యాంపులు, కరోనా బాధితులకు మందులు, సహాయం తదితర సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని సూచించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా అన్ని జిల్లా, మండల, గ్రామ కేంద్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించాలని తేల్చారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేశారు. పార్టీ శ్రేణులందరూ విధిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
కరోనా బాధితులకు అండగా..
కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న వేళ బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాష్ర్టం కోవిడ్ ప్రభావంతో అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అధికార పక్షం చర్యలను వ్యతిరేకించారు. రాష్ర్టంలో పాలన ఉందా అని ప్రశ్నించారు. భూకబ్జాలు, మైన్, వైన్, సాండ్ మాఫియాలతో రాష్ర్టం అధోగతి పాలవుతుందని దుయ్యబట్టారు. కరోనా వ్యాధితో వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చ ేస్తుందని వాపోయారు. కరోనా బాధితులకు ఆస్పత్రులు, బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏవీ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ప్రతి బూత్ లో..
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి బూత్ లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించేలా చూడాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల వెంటే ఉన్నామని చెప్పేందుకు కరోనా బాధితుల కోసం కనీసం 50 మాస్కులు పంపిణీ చ చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో కార్యకర్తలు అందరూ పాల్గొనాలని సూచించారు. పార్టీ ప్రజల వెంటే ఉంటుందని చెప్పేందుకు ఇదే మంచి తరుణమని నేతలు చెప్పినట్లు తెలిసింది. మందుల కిట్లు, ఆహార పధార్థాల పంపిణీ, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
ప్రజలకు అందుబాటులో కార్యాలయాలు
కరోనా విజృంభిస్తున్న వేళ కాంగ్రెస్ కార్యాలయాలను కొద్ది రోజులు కోవిడ్ రోగుల కోసం కేటాయించాలని పార్టీ దిశానిర్దేశం చేసింది. కరోనా తగ్గుదల కోసం ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా సూచించింది. ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాల్లోని కార్యాలయాలు, నగరంలోని గాంధీభవన్, ఇందిరాభవన్ లను సైతం కరోనా వైద్యం కోసం అప్పగించాలని నిర్ణయించింది. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ కేర్ పేరుతో అంబులెన్సులు , ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లాంటివి అందజేసేందుకు నర్ణయించినట్లు తెలిసింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్లేందుకు రాజీవ్ గాంధీ వర్ధంతిని బాగానే ఉపయోగించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.