CM Jagan: ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ఒంటెత్తు పోకడ పోతున్నారు. పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దిన నాయకులను పట్టించుకోవడం లేదు. ఫలితంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా ఆయన ధోరణిలో మార్పు రావడం లేదు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిని లెక్క చేయడం లేదు. దీంతో వారు అలకబూనుతున్నారు. ఇందులో ప్రథములు డీఎల్ రవీంద్రారెడ్డి. ఆయనతో మొదలైన అసంతృప్తుల జాబితా ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగన్ ముఖ్యమంత్రి కావాలని చాలా మంది కోరుకున్నారు. గ్రామస్థాయి నేతల నుంచి రాష్ర్ట స్థాయి వరకు పలువురు జగన్ కు అండగా నిలిచారు. అధికారంలోకి రావాలని శ్రమించారు. కానీ జగన్ ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదు. ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో వారిలో నైరాశ్యం పెరుగుతోంది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడినా ఫలితం కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. కొందరు బహిరంగంగా బయటపడినా ఇంకొందరు లోలోపలే కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది.
జగన్ అధికారంలోకి రావాలని తటస్తులు సైతం కోరుకున్నారు. ఏ పార్టీతో సంబంధం లేకపోయినా జగన్ వస్తే పరిస్థితులు బాగుంటాయని భావించిన కొందరు నేతలు జగన్ కు పరోక్షంగా మద్దతు తెలిపారు. అధికార మార్పుతోనే అభివృద్ధి సాధ్యమవుుతుందని అభిలషించారు. ఇందులో భాగంగానే జగన్ నాయకత్వాన్ని సమర్థించారు. ఫలితంగా ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఈ మధ్య జగన్ ఎవరిని లెక్క చేయడం లేదని ఓ వాదన బలంగా వినిపిస్తోంది. తానెవరి సహాయంతో అధికారంలోకి రాలేదని తన సొంత యుక్తులతోనే వచ్చానని అనుకుంటున్నారు. దీంతో ఎవరి పట్ల అభిమానం చూపడం లేదు.
Also Read: Huzurabad By Poll: హుజూరాబాద్ విజేత ఎవరు? ఉత్కంఠ.. తేలేది నేడే.. కౌంటింగ్ ప్రారంభం
అసంతృప్తులు ఉండడం కొత్తేమీ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నారు. అధికారంలోకి వచ్చాక పెరిగారు. కానీ ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో వారిలో అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీని వీడాలా లేక వైసీపీలోనే కొనసాగాలే అనే డైలమాలో పడిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మారేందుకు కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప విజయం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: మహిళలకు మోదీ సర్కార్ శుభవార్త.. రూ.లక్ష సంపాదించే అవకాశం?