BJP Vs TDP: తెలుగుదేశం పార్టీకి మరోచిక్కు వచ్చి పడింది. బిజెపి అగ్రనాయకత్వం ఆగ్రహానికి గురికాక తప్పదా అన్న బెంగ వెంటాడుతుంది. పవన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. తమ భాగస్వామ్య పక్షం అయి ఉండి.. పవన్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. కనీసం మాట మాత్రం గానైనా చెప్పకుండా టిడిపి తో కలవడం ఏమిటని అగ్ర నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ తోనే పవన్ కటీఫ్ చెప్పడంతో వారు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తెలుగుదేశం పార్టీ కారణమని వారు భావిస్తున్నట్లు సమాచారం. టిడిపి అంతు చూడాలని బిజెపి పెద్దలు ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యం పవన్ కళ్యాణ్ కు ఇచ్చామని.. మొన్నటికి మొన్న ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశానికి సైతం ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన విషయాన్ని బిజెపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఏపీలో తమ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవచ్చని.. అయితే ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేర్వేరుగా ఉంటాయని.. రానున్న రోజుల్లో తమ అవసరం ఏమిటో తెలుగుదేశం పార్టీకి రుచి చూపించాలన్న ఆలోచనలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇ ప్పటికే వివిధ కేసుల్లో అరెస్టయి చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం ద్వారా పరోక్షంగా తమ పవర్ ఏంటో పవన్ కు తెలియజేయాలని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. నమ్మదగిన మిత్రుడిగా ఉన్న పవన్ ను చంద్రబాబు తన వైపునకు తిప్పుకున్నారని.. ఇప్పటికే అన్నా డీఎంకే ఎన్డీఏకు దూరమైందని.. ఇప్పుడు పవన్ ను దూరం చేయడం ద్వారా… ఇండియా కూటమిని బలోపేతం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమని బిజెపి అగ్ర నేతలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.
తమ ఆత్మాభిమానంపై పవన్ దెబ్బ కొట్టారని బిజెపి భావిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు బిజెపి అంటే వణికి పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేనకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని.. కానీ టిడిపిని నమ్ముకుని తమను పవన్ బదనాం చేశారని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. పవన్ తమపై ఎంతగా రెచ్చిపోతే.. అంతకు రెండింతలు చంద్రబాబుకు నష్టాలు తప్పవని కొందరు బిజెపి నేతలు హితవు పలుకుతున్నారు. పవన్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబుకు అదనపు సమస్యలు తప్పవని సంకేతాలిస్తున్నారు. అయితే ఇప్పటికే కేసులు చుట్టూ ముట్టడంతో చంద్రబాబు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో బిజెపి అగ్రనేతల నుంచి ఈ తరహా వాయిస్ వస్తుండడం తెలుగు తమ్ముళ్లకు కలవరపాటుకి గురిచేస్తోంది.
అయితే ఇప్పటికే పవన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ కున్న క్షేత్రస్థాయి బలాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకుంటే అగ్ర నేతల నుంచి ఈ తరహా హెచ్చరికలు వస్తాయని అంచనా వేశారు. అందుకే చాలా ప్రణాళికాయుతంగా ముందుకు వచ్చారు. తనను భాగస్వామ్య పక్షంగా చూసిన బిజెపిని గౌరవభావంతోనే చూశారు. టిడిపి తో కలిసి నడుద్దామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అటు బిజెపి పెద్దల వైఖరిని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో పవన్ ఒక స్థిరమైన నిర్ణయానికి రాగలిగారు. అయితే పవన్ పై బిజెపి అగ్రనేతల కోపానికి తాము మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని టిడిపి ఆందోళన చెందుతోంది.